బెంగళూరు (Bengaluru)లో మహిళా టెక్కీ (Woman Techie) హత్య సంచలనంగా మారింది. లైంగిక కోరిక (Sexual Desire) తీర్చలేదన్న కోపంతో ఓ ఇంటర్ విద్యార్థి (Intermediate Student) దారుణానికి పాల్పడిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. కర్ణాటకలోని మంగళూరుకు చెందిన షర్మిల కుశాలప్ప (Sharmila Kushalappa) (34) బెంగళూరులోని ఓ సాఫ్ట్‌వేర్ కంపెనీలో టెక్కీగా పనిచేస్తూ, రామ్మూర్తినగర పోలీస్ స్టేషన్ పరిధిలోని సుబ్రహ్మణ్య లేఅవుట్‌లోని ఓ ఫ్లాట్‌లో తన స్నేహితుడితో కలిసి నివసిస్తోంది.
ఈ నెల 3న షర్మిల ఒంటరిగా ఉన్న సమయంలో ఫ్లాట్‌లో అగ్నిప్రమాదం జరిగి ఆమె మృతి చెందినట్లు మొదట ఫిర్యాదు అందింది. దీంతో పోలీసులు ఇది ప్రమాదవశాత్తూ జరిగిన మరణమేనని భావించి దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఫోరెన్సిక్ నివేదికలో కీలక విషయాలు బయటపడటంతో కేసు దిశ మారింది. మంటలు అంటుకునే ముందు షర్మిల చేతులపై గాయాలు ఉండటంతో పాటు, ఆమె ఊపిరాడక మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
దీంతో పోలీసులు అప్రమత్తమై పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించారు. విచారణలో ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా అసలు నిజం బయటపడింది. షర్మిల నివసిస్తున్న ఫ్లాట్ పక్కనే కొడగు జిల్లా విరాజ్‌పేటకు చెందిన ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి కర్నల్ కురై (18) తన తల్లితో కలిసి ఉంటున్నట్లు తేలింది. ఈ నెల 3న షర్మిల స్నేహితుడు ఇంట్లో లేని సమయంలో కురై కిటికీ ద్వారా ఆమె గదిలోకి చొరబడి లైంగిక కోరిక తీర్చాలని ఒత్తిడి చేశాడు.
అతడిని షర్మిల గట్టిగా అడ్డుకుని అరుస్తూ తోసివేయడంతో కురై కోపంతో వంటగదిలోని కత్తితో ఆమెపై దాడి చేశాడు. పరుపుపై పడిపోయిన షర్మిలపై మరోసారి దాడి చేసి, అరవకుండా ఉండేందుకు దిండుతో ఆమె నోటిని గట్టిగా మూయడంతో ఊపిరాడక ఆమె మృతి చెందింది. అనంతరం ఆధారాలు నాశనం చేయాలన్న ఉద్దేశంతో రక్తపు మరకలున్న దుస్తులను తీసి అదే గదిలో నిప్పంటించి కాల్చేశాడు. మంటలు వ్యాపించడంతో కిటికీ ద్వారా దూకి అక్కడి నుంచి పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు.
ఈ దారుణ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. బెంగళూరులో చోటుచేసుకున్న ఈ ఘటన మహిళల భద్రతపై మరోసారి తీవ్ర ఆందోళనకు కారణమవుతోంది.








