తెలుగుదేశం పార్టీ(TDP) ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ (Daggupati Prasad)పై తీవ్ర అవినీతి ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి. ఎగ్జిబిషన్ నిర్వాహకులు రూ.10 లక్షలు ఇవ్వలేదని ఎమ్మెల్యే అనుచరులు గొడవకు దిగిన ఘటన జరిగిన మరుసటి రోజే.. రూ.20 లక్షలు ఇవ్వలేదని వైన్స్ షాపునకు (Wine Shop) నిప్పుపెట్టిన ఘటనలో ఎమ్మెల్యే అనుచరులే ఉండడం, టీడీపీ ఎమ్మెల్యేపై సొంత పార్టీకి చెందిన వైన్ షాప్ నిర్వాహకుడు సంచలన వ్యాఖ్యలు చేయడం కలకలం రేపుతోంది.
వివరాల్లోకి వెళితే.. అనంతపురం నగర శివార్లలోని హైదరాబాద్–బెంగళూరు జాతీయ రహదారి సమీపంలో ఉన్న ఓ మద్యం షాపుకు దుండగులు నిప్పు పెట్టారు. ఈ ఘటనలో మద్యం షాపుతో పాటు అక్కడ ఉన్న ఒక ఆటో పూర్తిగా దగ్ధమయ్యాయి. మొదట ప్రమాదంగా భావించిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు, ఇది ప్రమాదం కాదని, ముందస్తు ప్రణాళికతో జరిగిన కుట్రగా మద్యం షాపు యజమాని ఆరోపణలు చేస్తున్నారు.
తన లిక్కర్ షాపుకు ఉద్దేశపూర్వకంగానే నిప్పు పెట్టించారని మద్యం షాపు యజమాని నంబూరి వెంకటరమణ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఘటన వెనుక అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పాత్ర ఉందని ఆయన ఆరోపించారు. షాపును తనకు అప్పగించాలని, లేదంటే రూ.20 లక్షల లంచం ఇవ్వాలని ఎమ్మెల్యే ఒత్తిడి తెచ్చారని వెంకటరమణ తెలిపారు. ఆ డిమాండ్‌కు అంగీకరించకపోవడంతోనే తన షాపునకు నిప్పు పెట్టించారని ఆరోపించారు.
ఈ ఘటనకు ముందు రాత్రి టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తనకు ఫోన్ చేసి బెదిరింపులకు పాల్పడ్డారని, బండబూతులు తిట్టి స్వయంగా వార్నింగ్ ఇచ్చారని నంబూరి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. తన జీవనాధారాన్ని ధ్వంసం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిగిందని చెప్పారు. ఘటనపై పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తుండగా, కీలక ఆధారాలు బయటపడినట్టు సమాచారం.
ఈ ఘటనపై విచారణ కొనసాగుతుండగా, ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్‌ను వెంటనే టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలని నంబూరి వెంకటరమణ డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే దౌర్జన్యాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు అధికారికంగా ఫిర్యాదు చేస్తానని ఆయన ప్రకటించారు. ఈ ఘటన అనంతపురం జిల్లాలో రాజకీయంగా తీవ్ర చర్చకు దారి తీస్తుంది.
రూ.20 లక్షలు ఇవ్వలేదని మద్యం షాప్‌కు నిప్పు
— Telugu Feed (@Telugufeedsite) January 13, 2026
తన లిక్కర్ షాప్‌కు నిప్పు పెట్టించింది టీడీపీ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ అంటున్న షాపు యజమాని నంబూరి వెంకటరమణ
మద్యం షాపు తనకు ఇవ్వాలని, లేకపోతే రూ.20 లక్షలు లంచం డిమాండ్ చేశారని ఆరోపణ
మద్యం షాపు యజమాని నంబూరి వెంకటరమణకు నిన్న… https://t.co/dnRqJSBtvz pic.twitter.com/wFn2YDMgFE








