చైనా మాంజా (Chinese Manja) అమాయకుల ప్రాణాలను బలి తీసుకుంటోంది. హైదరాబాద్ (Hyderabad) నగర పరిధిలో చైనా మాంజా కారణంగా జరుగుతున్న ప్రమాదాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. మాంజా దెబ్బకు పలువురు తీవ్ర గాయాలపాలవుతుండగా, కొందరు ప్రాణాలు కూడా కోల్పోతున్నారు. తాజాగా ఈ ప్రమాదాల జాబితాలో ఓ పోలీస్ అధికారి పేరు కూడా చేరడం ఆందోళన కలిగిస్తోంది.
ఉప్పల్‌లో ఏఎస్ఐ నాగరాజు (ASI Nagaraju) చైనా మాంజా ప్రమాదానికి గురయ్యారు. నల్లకుంట పోలీస్ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఆయన, ఎగ్జిబిషన్ డ్యూటీ కోసం ఉప్పల్‌లోని తన నివాసం నుంచి బయలుదేరిన సమయంలో ఈ ఘటన జరిగింది. ఉప్పల్ పీఎస్ పరిధిలోని సౌత్ స్వరూప్ నగర్ వద్ద సాయంత్రం వేళ అకస్మాత్తుగా చైనా మాంజా ఆయన మెడకు చుట్టుకుని గొంతుకు తీవ్ర గాయాలు చేసింది. వెంటనే అప్రమత్తమైన స్థానికులు ఆయనను ఎల్బీనగర్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.
ఇదే తరహాలో మరో విషాదకర ఘటన హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మీర్‌పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. అల్మాస్‌గూడ ప్రధాన రహదారిపై రోడ్డుప్రక్కన నడుచుకుంటూ వెళ్తున్న యాదమ్మ (Yadamma) (సుమారు 70 ఏళ్ల వయసు) అనే వృద్ధ మహిళ కాలికి అకస్మాత్తుగా చైనా మాంజా చుట్టుకుంది. దీంతో ఆమె కాలు తీవ్రంగా కోసుకుపోయి భారీగా రక్తస్రావం జరిగింది. ఘటనను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వృద్ధురాలిని సమీపంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
చైనా మాంజా వల్ల పెరుగుతున్న ప్రమాదాలపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిషేధం ఉన్నప్పటికీ మాంజా విక్రయాలు కొనసాగుతుండటంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చైనా మాంజాపై కఠిన చర్యలు తీసుకోవాలని, నగరంలో నియంత్రణ మరింత కఠినతరం చేయాలని ప్రజలు అధికారులను డిమాండ్ చేస్తున్నారు.








