సంక్రాంతి పండుగ (Sankranti Festival) వేళ ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మద్యం ప్రియులకు రాష్ట్ర ప్రభుత్వంషాక్ (State Government Shock) ఇచ్చింది. మద్యం ధరలను పెంచుతూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తాజా నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా లిక్కర్ ధరలు (Liquor Prices) పెరిగాయి. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం రూ.99 ఎంఆర్‌పీ ఉన్న మద్యం బాటిళ్లను మినహాయించి, మిగిలిన అన్ని రకాల మద్యం ఉత్పత్తులపై ఒక్కో బాటిల్‌కు రూ.10 చొప్పున ధర పెంపు అమలు చేయనున్నారు. ఈ పెంపు IMFL, FL, బీర్, వైన్ వంటి అన్ని విభాగాల మద్యం ఉత్పత్తులకు వర్తిస్తుంది.
అదే సమయంలో మద్యం విక్రయాల్లో రిటైలర్లకు ఇచ్చే మార్జిన్‌ను కూడా ప్రభుత్వం స్వల్పంగా పెంచింది. IMFL, FLతో పాటు రూ.99 ఎంఆర్‌పీ ఉన్న బీర్, వైన్ బాటిళ్లపై రిటైలర్ మార్జిన్‌ను 1 శాతం పెంచాలని నిర్ణయించింది. ఈ మార్పుతో రిటైలర్లకు కొంత ఊరట లభించనుందని అధికారులు చెబుతున్నారు. మద్యం ధరల పెంపు ద్వారా ప్రభుత్వానికి ఏటా సుమారు రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం లభిస్తుందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రూ.99 ధర మినహా IMFL, FL లిక్కర్ బాటిళ్లపై రూ.10 పెంపు వల్ల ఈ ఆదాయం సమకూరుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
ఇక బార్లు, మద్యం షాపుల్లో ఒకే రకమైన మద్యం ఉత్పత్తులకు వేర్వేరు ధరలు ఉండటంతో వినియోగదారుల్లో ఏర్పడుతున్న అయోమయాన్ని తొలగించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహరించేందుకు నిర్ణయించడంతో బార్లు, షాపుల్లో మద్యం ధరలు సమానంగా ఉండే అవకాశం ఏర్పడనుంది.
ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఆదాయ వృద్ధి లక్ష్యంగా తీసుకున్న చర్యగా వివరిస్తున్నప్పటికీ, సంక్రాంతి పండుగ సమయంలో మద్యం ధరలు పెంచడంపై వినియోగదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పండుగ వేళ మద్యం మీద అదనపు భారం మోపడం తగదంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.








