తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ (Sankranti festival) రద్దీ తారాస్థాయికి చేరింది. సెలవులు రావడంతో హైదరాబాద్ (Hyderabad)లో స్థిరపడిన వారు పెద్ద ఎత్తున సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఈ క్రమంలో రైల్వే స్టేషన్లు (Railway Stations), బస్టాండ్లు (Bus Stands) ప్రయాణికులతో కిటకిటలాడుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్‌లోని ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ (JBS) బస్టాండ్లలో జనసందోహం పోటెత్తింది.
బస్టాండ్లకు వచ్చిన క్షణాల్లోనే బస్సులు నిండిపోతుండటంతో ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని టీజీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేసింది. జేబీఎస్, ఉప్పల్ క్రాస్ రోడ్, కేపీహెచ్‌బీ, బోయిన్‌పల్లి, గచ్చిబౌలి, ఎల్బీనగర్ నుంచి వివిధ జిల్లాలకు ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్ ప్రాంతాల్లో కూడా ప్రయాణికుల రద్దీ అధికంగా కనిపిస్తోంది. మొత్తం 6,431 ప్రత్యేక బస్సులను టీజీఎస్ ఆర్టీసీ నిర్వహిస్తోంది.
రోడ్డు మార్గంలోనూ పండుగ రద్దీ స్పష్టంగా కనిపిస్తోంది. హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల రద్దీ భారీగా పెరిగింది. పంతంగి టోల్ ప్లాజా వద్ద వాహనాలు బారులు తీరగా, ఏపీ–తెలంగాణ సరిహద్దు ప్రాంతాల్లో ట్రాఫిక్ నెమ్మదిగా కదులుతోంది. చిల్లకల్లు సమీపంలో వాహనాల కదలిక మందగించడంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇటు ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లోనూ సంక్రాంతి సందడి కనిపిస్తోంది. విజయవాడ బస్టాండ్, రైల్వే స్టేషన్‌లలో ప్రయాణికుల రద్దీ అధికంగా ఉంది. పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏపీఎస్ ఆర్టీసీ సుమారు 600 ప్రత్యేక బస్సులు నడుపుతోంది. అలాగే రైల్వే శాఖ కూడా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు సౌకర్యాలు కల్పిస్తోంది.
సంక్రాంతి పండుగ నేపథ్యంలో రవాణా సంస్థలు తీసుకున్న ఏర్పాట్లు ప్రయాణికులకు కొంత ఊరటనిస్తున్నప్పటికీ, రద్దీ మాత్రం ఇంకా కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. పండుగ రోజులు ముగిసే వరకూ ఇదే పరిస్థితి కొనసాగుతుందని అంచనా వేస్తున్నారు.








