రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ (Rayalaseema Lift Irrigation Scheme) విషయంలో చంద్రబాబు (Nara Chandrababu Naidu) తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ (YS Jagan Mohan Reddy) అన్నారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విస్తృత స్థాయి ప్రెస్‌మీట్‌లో కూటమి ప్రభుత్వం తీరుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్, భోగాపురం ఎయిర్‌పోర్టు (Bhogapuram Airport), పారిశ్రామిక రంగంపై ఆర్‌బీఐ నివేదిక (RBI Report), రాష్ట్ర అప్పులు, అవినీతి, పన్నుల పేరిట ప్రజలపై మోపుతున్న భారం వంటి కీలక అంశాలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని ఆయన నిలదీశారు.
సీమ లిఫ్ట్‌పై తెలంగాణ సీఎం (Telangana CM) వ్యాఖ్యలను చంద్రబాబు ఖండించకపోవడమే కాదు, ఆ స్కీమ్ అవసరం లేదని చెప్పడం వెనుక రహస్య ఒప్పందం స్పష్టంగా కనిపిస్తోందన్నారు. నీటి కొరతతో అల్లాడుతున్న రాయలసీమకు ఈ లిఫ్ట్ స్కీమ్ ఒక ఇన్సూరెన్స్ పాలసీ లాంటిదని, రాయలసీమతో పాటు నెల్లూరు, చెన్నై ప్రాంతాలకు కూడా ఇది సంజీవని వంటిదని వివరించారు. శ్రీశైలం నుంచి కేటాయించిన నీటిని గత 20 ఏళ్లలో కేవలం మూడు, నాలుగు సార్లే పొందగలిగామని గుర్తుచేశారు.
తెలంగాణలో అనేక లిఫ్ట్ ప్రాజెక్టుల ద్వారా రోజుకు 8 టీఎంసీల వరకు నీటిని తోడేస్తున్నారని, దీనివల్ల ఆంధ్రప్రదేశ్ తీవ్రంగా నష్టపోయిందన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్న కాలంలోనే ఈ నిర్ణయాలన్నీ జరిగాయని, అప్పుడు ఆయన పూర్తిగా మౌనం పాటించారని విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్జీటీని ఆశ్రయించి తెలంగాణకు జరిమానా విధించే వరకూ పోరాటం చేసిన విషయాన్ని గుర్తుచేశారు. రాయలసీమ క్షేమం కోసం తమ ప్రభుత్వం రూ.990 కోట్లతో లిఫ్ట్ స్కీమ్ పనులు చేపట్టినా, ప్రభుత్వం మారిన తర్వాత ప్రాజెక్టుకు ‘చంద్రగ్రహణం’ పట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.
భోగాపురంలో క్రెడిట్ చోరీ
భోగాపురం ఎయిర్‌పోర్టు విషయంలోనూ చంద్రబాబు క్రెడిట్ చోరీ(Credit Stealing)కి పాల్పడుతున్నారని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు హయాంలో భూసేకరణ, అనుమతులు ఏమీ చేయకపోయినా, వైసీపీ ప్రభుత్వమే 2,703 ఎకరాల్లో అంతర్జాతీయ ఎయిర్‌పోర్టు నిర్మాణానికి అన్ని అనుమతులు సాధించి, భూసేకరణ పూర్తి చేసి, 2023లో భూమిపూజ నిర్వహించిందన్నారు. అయినా ఇప్పుడు పూర్తిగా తమకే క్రెడిట్ కావాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. వంటవాళ్లకు, డ్రైవర్లకు సూట్లు, బూట్లు వేసి చంద్రబాబు ఎంవోయూలు చేసుకుంటాడని, ఇది చంద్రబాబుకు అలవాటైన పనేనని జగన్ ఎద్దేవా చేశారు. అనౌన్స్‌మెంట్స్ – నాట్ ఇన్వెస్ట్‌మెంట్స్, పబ్లిసిటీ – నాట్ రియాలిటీ అంటూ సెటైర్లు పేల్చారు.
బాబు హయాంలో పారిపోతున్న పారిశ్రామిక వేత్తలు
పరిశ్రమల విషయంలో చంద్రబాబు చేస్తున్న ప్రచారం అంతా అబద్ధమని, డిసెంబరు 11, 2025న విడుదలైన ఆర్‌బీఐ నివేదికే దీనికి నిదర్శనమన్నారు. వైయస్సార్‌సీపీ పాలనలో తయారీ రంగంలో రాష్ట్రం దక్షిణ భారతంలో తొలి స్థానంలో, దేశంలో ఐదో స్థానంలో నిలిచిందని వివరించారు. చంద్రబాబు హయాంలోనే పెద్ద పారిశ్రామిక వేత్తలు రాష్ట్రం విడిచి వెళ్లారని, పరిశ్రమల పేరుతో వేల కోట్ల విలువైన భూములను నామినేషన్ పద్ధతిలో బినామీలకు కట్టబెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో ఏ ఇండస్ట్రీ అయినా తీసుకోండి.. కూటమి నేతలకు కప్పం కట్టకపోతే ఎవరైనా పరిశ్రమ నడిపే పరిస్థితి ఉందా.. తాను రాసిస్తా అని వైఎస్ జగన్ అన్నారు.

అప్పుల్లో గిన్నీస్ రికార్డ్
రాష్ట్ర అప్పులపై జరిగిన దుష్ప్రచారాన్ని కూడా జగన్ ఖండించారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనలో ఏటా 22.63 శాతం అప్పులు పెరిగితే, తమ హయాంలో అది 13.57 శాతమేనని స్పష్టం చేశారు. అంతేకాకుండా తమ ప్రభుత్వం చేసిన అప్పుల్లో రూ.2.74 లక్షల కోట్లు నేరుగా ప్రజల ఖాతాల్లో జమ చేశామని తెలిపారు. అయితే కొత్త ప్రభుత్వం కేవలం 18 నెలల్లోనే రూ.3 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి గిన్నీస్ రికార్డ్ సృష్టించిందన్నారు. ఇంత అప్పు చేసినా, సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. మొత్తంగా చంద్రబాబు పాలన మోసం, దగా, అవినీతితో నిండి ఉందని, ప్రజల ప్రయోజనాల కోసం వైయస్సార్‌సీపీ పోరాటం కొనసాగిస్తుందని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్పష్టం చేశారు.









