డిప్యూటీ స్పీకర్ రఘురామకు షాక్‌.. రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు

డిప్యూటీ స్పీకర్ రఘురామకు షాక్‌.. రాష్ట్రపతి కార్యాలయం ఆదేశాలు

ఆంధ్రప్రదేశ్ శాసనసభ డిప్యూటీ స్పీకర్ (Deputy Speaker) రఘురామకృష్ణరాజు (Raghurama Krishnam Raju)కు రాష్ట్ర‌ప‌తి కార్యాల‌యం (President’s Office) షాకిచ్చింది. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉండి రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారంటూ వచ్చిన ఫిర్యాదును రాష్ట్రపతి కార్యాలయం తీవ్రంగా పరిగణించింది. ఈ మేరకు తక్షణమే విచారణ జరిపి అవసరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ (Vijayanand)కు రాష్ట్రపతి కార్యాలయం లేఖ ద్వారా సూచించింది.

జేబీపీ (JBP) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పరసా సురేష్ కుమార్ (Parasa Suresh Kumar) రాష్ట్రపతికి ఫిర్యాదు చేస్తూ.. డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణరాజు ఇటీవల కాలంలో పొలిటిక‌ల్‌ డిబేట్స్‌లో పాల్గొంటూ రాజకీయ ప్రత్యర్థులపై విమర్శలు చేయడం, వివాదాస్పద రాజకీయ అంశాలపై బహిరంగంగా స్పందించడం ద్వారా రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని ఆరోపించారు. స్పీకర్, డిప్యూటీ స్పీకర్ వంటి రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు రాజకీయ పార్టీల కార్యకలాపాలకు దూరంగా ఉండాల్సిన బాధ్యత ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఫిర్యాదును పరిశీలించిన రాష్ట్రపతి కార్యాలయం, దీనిపై వెంటనే విచారణ జరపాలని, పిటిషనర్ అందించిన నివేదిక ఆధారంగా తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శికి స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ఈ పరిణామంతో ఏపీ రాజకీయ వర్గాల్లో చర్చలు మొదలయ్యాయి.

ఈ వ్యవహారంపై జేబీపీ పార్టీ అధినేత జడ శ్రవణ్ కుమార్ (Jada Shravan Kumar) స్పందిస్తూ.. డిప్యూటీ స్పీకర్‌పై చర్యలు తీసుకోవాలంటూ అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయిస్తామని తెలిపారు. రాజ్యాంగ పదవులను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం ప్రజాస్వామ్యానికి హానికరమని ఆయన వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రపతి కార్యాలయ సూచనల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ అంశంపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఆసక్తికరంగా మారింది. విచారణ తర్వాత రఘురామకృష్ణరాజుపై చర్యలు ఉంటాయా? అన్న దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment