అమెరికా (America)లో తెలుగు యువతి నిఖిత హత్య కేసు (Nikitha Murder Case)లో పోలీసులు వెలికితీసిన తాజా వివరాలు సంచలనంగా మారాయి. కేవలం వెయ్యి డాలర్ల అప్పు కారణంగానే నిఖితను ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (Arjun Sharma) హత్య చేసినట్లు దర్యాప్తులో ప్రాథమికంగా తేలినట్టు సమాచారం.
పోలీసుల విచారణ ప్రకారం నిఖిత, అర్జున్ శర్మకు గతంలో మొత్తం 4,500 డాలర్లు (Loan) అప్పుగా ఇచ్చింది. కొంతకాలం తరువాత అర్జున్ 3,500 డాలర్లు తిరిగి చెల్లించగా, మిగిలిన 1,000 డాలర్లను నిఖిత తిరిగి ఇవ్వాలని అడిగింది. ఈ విషయంపై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అదే వివాదం చివరకు ఘోరమైన హత్యకు దారితీసిందని అధికారులు అనుమానిస్తున్నారు.
హత్య అనంతరం నిందితుడు అర్జున్ శర్మ అదే రోజు అమెరికా (America) నుంచి భారత్ (India)కు పారిపోయినట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో అతడిపై అనుమానాలు మరింత బలపడ్డాయి. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేసిన అమెరికా పోలీసులు, నిందితుడిని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ ఏజెన్సీల సహకారంతో పాటు భారత అధికారులతోనూ సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది.
కాగా నిఖిత మృతితో ఆమె కుటుంబసభ్యులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. చిన్న మొత్తమైన అప్పు కోసం ఒక యువతి ప్రాణం కోల్పోవడం పట్ల తెలుగు ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో పూర్తి నిజానిజాలు వెలుగులోకి రావాల్సి ఉండగా, తదుపరి దర్యాప్తు వివరాలు వెలువడాల్సి ఉంది.








