నిషేధిత పైరసీ వెబ్‌సైట్ iBOMMA కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. iBOMMA నిర్వాహకుడు రవి (Ravi) దాఖలు చేసిన బెయిల్ పిటిషన్ (Bail Petition)ను నాంపల్లి కోర్టు (Nampally Court) తిరస్కరించింది. తనపై నమోదైన ఐదు కేసుల్లో బెయిల్ మంజూరు చేయాలని రవి కోర్టును ఆశ్రయించగా, ఈ వ్యవహారం ప్రస్తుతం దర్యాప్తు దశలో ఉందని పోలీసులు కోర్టుకు వివరించారు. ముఖ్యమైన ఆధారాలు సేకరిస్తున్న సమయంలో బెయిల్ ఇస్తే కేసు దర్యాప్తుకు ఆటంకం కలగవచ్చని పోలీసులు వాదించారు.
అదేవిధంగా, రవికి ఇతర దేశాల్లో పౌరసత్వం లేదా విదేశీ సంబంధాలు ఉన్నాయన్న అనుమానాలను పోలీసులు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. బెయిల్ మంజూరైతే రవి విదేశాలకు పారిపోయే అవకాశం ఉందని, అలా జరిగితే కేసు విచారణకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న నాంపల్లి కోర్టు, రవి బెయిల్ పిటిషన్‌ను కొట్టివేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ తీర్పుతో పైరసీ వెబ్‌సైట్లపై చర్యలు మరింత కఠినంగా మారనున్నాయన్న చర్చ సాగుతోంది.








