అమెరికాలో మాజీ లవర్‌ను హ‌త్య చేసి ఇండియాకు ప‌రార్‌?

అమెరికాలో తెలుగు యువతి హత్య.. నిందితుడు ఇండియాకు పరారీ

అమెరికా (America)లో తెలుగు యువతి దారుణ హత్యకు గురైన ఘటన కలకలం రేపుతోంది. తన ప్లాట్ లో మాజీ ప్రేయసిని హత్య చేసిన నిందితుడు పోలీసులకు మిస్సింగ్ అంటూ ఫిర్యాదు చేసి అదే రోజు ఇండియాకు పారిపోయి వచ్చిన ఘటన సంచలనంగా మారింది. అగ్ర‌రాజ్యం మేరీల్యాండ్ రాష్ట్రంలోని కొలంబియా ప్రాంతంలో నివసిస్తున్న నిఖిత గోడిశాల (Nikhita Godishala) (27) అనే యువతి అనుమానాస్పదంగా హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ (Arjun Sharma) (26) ప్రధాన నిందితుడిగా పోలీసులు అనుమానిస్తున్నారు.

డిసెంబర్ 31న నిఖిత కనిపించడం లేదంటూ అర్జున్ శర్మే స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. చివరిసారిగా ఆమెను ఎల్లికాట్ సిటీలో చూశానని తెలిపాడు. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసిన రోజే అర్జున్ శర్మ అమెరికా నుంచి ఇండియా(India)కు పారిపోయినట్లు అధికారులు గుర్తించారు. ఈ పరిణామంతో అతడిపై అనుమానం బలపడింది.

సెర్చ్ వారెంట్‌తో అర్జున్ శర్మ నివాసంలో తనిఖీలు నిర్వహించిన పోలీసులు, అతడి అపార్టుమెంట్‌లో నిఖిత మృతదేహాన్ని గుర్తించారు. ఆమె శరీరంపై కత్తి పోటు గాయాలు ఉండటంతో ఇది హత్యేనని నిర్ధారించారు. నిఖితను హత్య చేసి ఆధారాలు దాచిపెట్టి, వెంటనే ఇండియాకు పరారైనట్లు పోలీసులు భావిస్తున్నారు.

నిందితుడు దేశం విడిచి వెళ్లడంతో అతడిని అరెస్ట్ చేసేందుకు ఫెడరల్ పోలీసుల సహాయాన్ని స్థానిక పోలీసులు కోరారు. మరోవైపు నిఖిత గోడిశాల మూలాలు హైదరాబాద్‌లోని సికింద్రాబాద్ ప్రాంతంలో ఉన్నట్లు సమాచారం. ఈ ఘటనపై ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని, అర్జున్ శర్మను త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని అమెరికా పోలీసులు స్పష్టం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment