డ్రైవర్ రాయుడు హత్య కేసు.. కూటమి నేతలకు బిగుస్తున్న ఉచ్చు!!

డ్రైవర్ రాయుడు హత్య కేసు.. కూటమి నేతలకు బిగుస్తున్న ఉచ్చు!!

జనసేన పార్టీ శ్రీకాళహస్తి ఇన్‌చార్జ్ కోట వినుత డ్రైవర్ రాయుడు హత్య కేసు మరోసారి సంచలనంగా మారింది. ఎమ్మెల్యే టికెట్ ద‌క్కించుకోవాల‌నే ఆత్రుత‌, త‌న గెలుపు కోసం మిత్రపక్ష నేతను తన గుప్పెట్లో కీలుబొమ్మలా ఉంచుకోవాలనే దురాలోచనలే ఈ హత్యకు దారితీసినట్లు ఆరోప‌ణ‌లు వినిపిస్తున్నాయి. ఇందుకు మృతుడు రాయుడు హత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియో మ‌రింత బ‌లాన్ని చేకూరుస్తోంది. ఈ వీడియో ప్రస్తుతం దర్యాప్తులో కీలక ఆధారంగా మారింది. ఈ కేసులో శ్రీకాళహస్తి టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డికి చెన్నై పోలీసులు సమన్లు జారీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అసలు ఏం జరిగిందంటే..

హత్యకు ముందు రాయుడు సెల్ఫీ వీడియో
త‌న‌ హత్యకు ముందు రికార్డ్ చేసిన సెల్ఫీ వీడియోలో డ్రైవర్ రాయుడు అనేక షాకింగ్ విషయాలను బయటపెట్టాడు. 2019 నుంచి కోట వినుత వద్ద నమ్మకంగా డ్రైవర్‌గా పనిచేస్తున్నానని, జనసేన పార్టీకి చెందిన చంద్ర, శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచరుడు సుజిత్‌కు తనను పరిచయం చేశారని రాయుడు వివరించాడు. సుజిత్ తనకు రూ.30 లక్షలు ఇస్తానని ఆశ‌చూపి, ‘కోట వినుత ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరెవ‌రితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు’ అనే పూర్తి సమాచారం చెప్పాలని ఫోన్ ద్వారా ఒత్తిడి చేసినట్టు రాయుడు వెల్లడించాడు. టికెట్ కోసం మేడమ్ ప్రయత్నిస్తున్నారా? ఎవరెవరితో చర్చలు జరుపుతున్నారు? అన్న వివరాలన్నింటినీ తాను సుజిత్‌కు చెప్పానని వీడియోలో చెప్పాడు. ఎన్నికలు పూర్తయ్యాక మాటిచ్చిన డబ్బులు ఇవ్వలేదని, అడిగితే సుజిత్ తనకు రూ.20 లక్షలు మాత్రమే ఇచ్చాడని చెప్పాడు.

వినుత దంపతులను చంపేందుకు..
వీడియోలో డ్రైవర్ రాయుడు మరో సంచలన విష‌యాన్ని వెల్ల‌డించాడు. “మీ మేడమ్, మీ సార్‌ను టీడీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చంపేయమని చెప్పాడని నాకు చెప్పారు” అంటూ రాయుడు పేర్కొన్న మాటలు స్థానికుల‌ను, చెన్నై పోలీస్ అధికారులను షాక్‌కు గురిచేస్తున్నాయి. ఈ విషయాలన్నింటినీ తన సెల్ఫీ వీడియోలో స్పష్టంగా చెప్పాడు రాయుడు.

ఎమ్మెల్యే వ్యవహారంపై అనుమానాలు
హత్య జరిగిన వెంటనే ప్రెస్‌మీట్ పెట్టిన టీడీపీ ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి, ఇదంతా అంతర్గత వ్యవహారమని, రాయుడును ఒక‌టి రెండు సార్లు చూశాన‌ని, త‌న‌కు అత‌ను తెలుసని వ్యాఖ్యానించిన విషయం అప్పట్లో చర్చనీయాంశమైంది. డ్రైవ‌ర్ రాయుడు మృత‌దేహం చెన్నైలోని ఓ కాలువ‌లో ల‌భ్య‌మ‌వ్వ‌డం, తనపై ఆరోపణలు రావడంతో రెండు రోజుల పాటు శ్రీకాళహస్తిని వదిలి వెళ్లి, మ‌ళ్లీ తిరుమ‌ల‌లో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యారు. ఆ త‌రువాత కోట వినుత దంప‌తులు ఈ హ‌త్య వెనుక బొజ్జ‌ల సుధీర్‌రెడ్డి ఉన్నార‌ని, రాయుడు సెల్ఫీ వీడియో విడుద‌ల చేయ‌గానే అది తీవ్ర దుమారం రేగింది. మ‌ళ్లీ ఢిల్లీలో ప్ర‌త్య‌క్ష‌మై, అక్క‌డ మీడియాను అడ్ర‌స్ చేస్తూ అది ఏఐ వీడియో అని ఎమ్మెల్యే ప్రకటించడం స్థానికులకు ఆశ్చ‌ర్యం క‌లిగించింది.

రాజకీయ కుట్ర ఆరోపణలు
ఇదిలా ఉండగా, ఇది పూర్తిగా రాజకీయ కుట్రేనని జనసేన మాజీ నేత కోట వినుత ఆరోపించారు. ఈ వ్యవహారంలో కొట్టే సాయి ప్రసాద్ ప్రధాన పాత్రధారి అని ఆమె వెల్లడించారు. హత్య కేసులో తాము జైలుకు వెళ్లిన అనంతరం కొట్టే సాయి ప్రసాద్‌ను శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్‌గా నియమించడాన్ని ఆమె ప్రస్తావించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ పవన్ కళ్యాణ్‌కు లేఖ రాసిన విషయం కూడా అప్పట్లో సంచలనం రేపింది. జైలు నుంచి విడుదలైన తర్వాత, పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని వినుత దంపతులు ప్రకటించారు. వారి స్టేట్‌మెంట్ల ఆధారంగానే చెన్నై పోలీసులు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి నోటీసులు జారీ చేసినట్టు సమాచారం.

జనసేన కార్యకర్త అయిన డ్రైవర్ రాయుడు హత్యకు సంబంధించి కీలక సమాచారం సేకరించిన పోలీసులు, ఎమ్మెల్యే పాత్రపై విచారణకు సిద్ధమయ్యారు. ఇప్ప‌టికే వ‌రుస‌గా అనుమానితుల‌ను విచారిస్తూ వ‌స్తున్నారు. త్వరలోనే సుధీర్ రెడ్డిని విచారించనున్నట్లు సమాచారం.

దర్యాప్తులో కీలక మలుపు
మృతుడు రాయుడు సెల్ఫీ వీడియోతో పాటు పోస్టుమార్టం రిపోర్ట్ కూడా ఈ కేసులో కీలక ఆధారంగా మారింది. రాయుడిపై జరిగిన దాడి, హత్యకు సంబంధించిన మరిన్ని సంచలన విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశముంది. టీడీపీ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి స‌మ‌న్లు జారీ చేయ‌డంతో ఈ కేసు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారి తీస్తుండగా, రానున్న రోజుల్లో మరిన్ని కీలక నిజాలు బయటపడే అవకాశం ఉందని విశ్లేషకులు అంటున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment