బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, జాగృతి విభాగం అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్‌ను కసబ్‌తో పోల్చిన సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, “ఆ వ్యాఖ్యలు వింటే కేసీఆర్ కూతురిగా నాకు రక్తం ఉడుకుతుంది. ఉద్యమ నాయకుడిపై మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించాలి. రేవంత్ చేసిన వ్యాఖ్యలకు రెండుసార్లు ఉరి వేయాల్సి ఉంటుంది” అంటూ ఘాటు విమర్శలు గుప్పించారు. ప్యాకేజీలు అమ్ముకున్న ట్రబుల్, బబుల్ షూటర్లు ఏమి చెబుతారని ఎద్దేవా చేశారు.
సిట్ ముందు హాజరై అన్ని విషయాలు వివరంగా చెబుతానని కవిత స్పష్టం చేశారు. బీఆర్ఎస్ మనుగడ కొనసాగాలంటే కేసీఆర్ తప్పనిసరిగా అసెంబ్లీకి రావాలని, నీటి ప్రాజెక్టులపై సభలో స్పష్టమైన వివరణ ఇవ్వాలని సూచించారు. అది జరగకపోతే బీఆర్ఎస్ను ఎవ్వరూ కాపాడలేరని హెచ్చరించారు. అలాగే, బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం జాగృతి సంస్థేనని వ్యాఖ్యానించారు.
తప్పులు చేసిన వారు అసెంబ్లీలో ఏం చెబుతారని ప్రశ్నించిన కవిత, “పిల్ల కాకులతో అసెంబ్లీ నడవదు” అంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. రాష్ట్రం ఏర్పడి 12 ఏళ్లు గడిచినా రంగారెడ్డి జిల్లాకు ఇంకా నీళ్లు ఇవ్వలేదని, ఎప్పుడిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. నీటి వ్యవహారాల్లో కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డికే ఎక్కువ తెలుసా అంటూ ప్రశ్నించారు.
ఉమ్మడి పాలమూరు జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి అన్యాయం చేస్తున్నారని ఆరోపించిన కవిత, పెన్షన్లు సక్రమంగా రావడం లేదని, కరెంటు సమస్యలు తీవ్రంగా ఉన్నాయని, మిషన్ భగీరథ పూర్తిగా పడకేసిందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టకుండా విమర్శల రాజకీయాల్లో మునిగిపోయిందని ఆమె విమర్శించారు.








