రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. రికార్డు సృష్టించిన హైదరాబాద్ విద్యార్థి

రూ.2.5 కోట్ల ప్యాకేజీ.. రికార్డు సృష్టించిన హైదరాబాద్ విద్యార్థి

హైదరాబాద్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ–హైదరాబాద్) మరోసారి దేశ దృష్టిని ఆకర్షించింది. ఐఐటీహెచ్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థి ఎడ్వర్డ్ నాథన్ వర్గీస్ ఏకంగా రూ.2.5 కోట్ల వార్షిక వేతనంతో ఉద్యోగ ఆఫర్ అందుకుని సంచలనం సృష్టించాడు. నెదర్లాండ్స్‌కు చెందిన ప్రముఖ గ్లోబల్ ట్రేడింగ్ సంస్థ ఆప్టివర్ (Optiver) ఈ భారీ ప్యాకేజీని ఆఫర్ చేయడం విశేషం. దివంగ‌త నేత వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి హ‌యాంలో 2008లో ఐఐటీ హైదరాబాద్ స్థాపించినప్పటి నుంచి ఇదే అత్యధిక ప్యాకేజీగా రికార్డులకెక్కింది.

రెండు నెలల సమ్మర్ ఇంటర్న్‌షిప్ అనంతరం ప్రీ–ప్లేస్‌మెంట్ ఆఫర్ (PPO) రూపంలో ఈ ఉద్యోగం లభించింది. ఆ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన ఇద్దరు విద్యార్థుల్లో వర్గీస్ ఒక్కరే పూర్తి స్థాయి ఉద్యోగాన్ని దక్కించుకోవడం గమనార్హం. ప్రస్తుతం 21 ఏళ్ల వర్గీస్, జూలై నుంచి నెదర్లాండ్స్‌లోని ఆప్టివర్ కార్యాలయంలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పని ప్రారంభించనున్నాడు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన వర్గీస్‌ తల్లిదండ్రులిద్దరూ ఇంజినీర్లే కావడం మరో విశేషం.

తన విజయంపై స్పందించిన వర్గీస్, “ఇది నా మొదటి, చివరి ఇంటర్వ్యూ. పీపీఓ వస్తుందని మెంటార్ చెప్పినప్పుడు చాలా ఆనందంగా అనిపించింది. ఫస్ట్ ఇయర్ నుంచే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్‌పై దృష్టి పెట్టి దేశంలోని టాప్–100లో నిలవడం నాకు ఎంతో ఉపయోగపడింది. ఐఐటీ ట్యాగ్ కూడా పెద్ద బలంగా నిలిచింది” అని చెప్పారు.

ఈ ప్లేస్‌మెంట్ సీజన్‌లో ఐఐటీహెచ్ మరో కంప్యూటర్ సైన్స్ విద్యార్థి రూ.1.1 కోట్ల ప్యాకేజీ అందుకోవడం కూడా గమనార్హం. ఈ ఏడాది సగటు ప్యాకేజీ గత ఏడాదితో పోలిస్తే 75 శాతం పెరిగి రూ.20.8 లక్షల నుంచి రూ.36.2 లక్షలకు చేరింది. డిసెంబర్‌లో ముగిసిన ఫేజ్–1 ప్లేస్‌మెంట్లలో 487 మంది అండర్‌గ్రాడ్యుయేట్ విద్యార్థుల్లో 62 శాతం మందికి ఉద్యోగాలు లభించాయి. త్వరలో ప్రారంభమయ్యే ఫేజ్–2 ప్లేస్‌మెంట్లలో మరిన్ని దేశీయ కంపెనీలు పాల్గొంటాయని ఐఐటీ హైదరాబాద్ ఆశాభావం వ్యక్తం చేసింది.

Join WhatsApp

Join Now

Leave a Comment