రెబల్ స్టార్ ప్రభాస్ అభిమానులకు న్యూఇయర్ సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్ ఇచ్చారు దర్శకుడు సందీప్ రెడ్డి వంగా. ఆయన దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘స్పిరిట్’ నుంచి ఫస్ట్ అఫీషియల్ పోస్టర్‌ను విడుదల చేస్తూ అభిమానుల నిరీక్షణకు తెరదించారు. సినిమా ప్రకటించినప్పటి నుంచి ఫ్యాన్‌మేడ్ పోస్టర్లు, ఏఐ ఫోటోలతో సోషల్ మీడియాలో హంగామా సాగిన ఈ ప్రాజెక్ట్‌కు, తాజాగా విడుదలైన పోస్టర్ మరింత క్రేజ్‌ను తీసుకొచ్చింది.
దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా ఈ పోస్టర్‌ను షేర్ చేస్తూ “భారతీయ సినిమా… మీ అజానబాహుడిని వీక్షించండి. హ్యాపీ న్యూ ఇయర్ 2026” అని క్యాప్షన్ ఇచ్చారు. పోస్టర్‌లో ప్రభాస్ ఇప్పటివరకు తెరపై చూడని డిఫరెంట్ లుక్‌లో కనిపిస్తున్నారు. షర్ట్ లేకుండా, ఒంటి నిండా గాయాలతో, డార్క్ గ్లాసెస్ ధరించి, ఆఫ్ వైట్ ప్యాంట్‌లో మాస్ లుక్‌లో నిల్చున్న ప్రభాస్ తీవ్రత, పాత్రలోని డార్క్ షేడ్‌ను స్పష్టంగా చూపిస్తోంది. ఆయనకు సిగరెట్ వెలిగిస్తున్నట్లు హీరోయిన్ తృప్తి డిమ్రి కనిపించడం కూడా పోస్టర్‌కు మరింత ఇంటెన్సిటీని జోడించింది. అయితే సందీప్‌రెడ్డి వంగా రిలీజ్ చేసిన పోస్టర్ 2.1 మిలియన్ వ్యూస్ సాధించి సరికొత్త రికార్డ్ నెలకొల్పింది.
ఈ భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రభాస్‌కు జోడీగా త్రిప్తి దిమ్రి నటిస్తుండగా, ప్రకాశ్ రాజ్, వివేక్ ఒబెరాయ్, సీనియర్ నటి కాంచన కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రఖ్యాత కొరియన్ నటుడు డాన్ లీ (మా డాంగ్-సియోక్) కూడా ఈ చిత్రంలో నటిస్తున్నారన్న ప్రచారం ఉన్నప్పటికీ, దీనిపై చిత్ర బృందం నుంచి ఇంకా అధికారిక ప్రకటన రాలేదు.
సందీప్ రెడ్డి వంగా స్టైల్, ప్రభాస్ మాస్ ఇమేజ్ కలిసి వస్తుండటంతో ‘స్పిరిట్’పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజా పోస్టర్‌తో ఈ సినిమా పట్ల ఉన్న హైప్ మరింత పెరిగిందని చెప్పొచ్చు.








