కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) కుటుంబం నుంచి శుభవార్త వెలువడింది. ఆమె కుమారుడు రెహాన్ వాద్రా (Rehan Vadra) నిశ్చితార్థం జరిగినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం. 25 ఏళ్ల రెహాన్ తన చిరకాల మిత్రురాలు అవివా బేగ్ (Aviva Baig) తో ఢిల్లీలో పూర్తిగా సన్నిహితుల మధ్య ప్రైవేట్‌గా నిశ్చితార్థం చేసుకున్నట్లు తెలుస్తోంది.
రెహాన్–అవివా గత ఏడేళ్లుగా ప్రేమలో ఉన్నారని, ఇటీవల రెహాన్ వివాహానికి ప్రతిపాదన చేయగా అవివా అంగీకరించారని సమాచారం. ఈ వివాహానికి గాంధీ–వాద్రా కుటుంబం (Gandhi–Vadra Family)తో పాటు అవివా కుటుంబం కూడా సంపూర్ణ సమ్మతి తెలిపినట్లు తెలిసింది.
ఈ నిశ్చితార్థ వార్తను తొలుత ఏబీపీ న్యూస్ (ABP News) వెల్లడించగా, అనంతరం న్యూస్18 (News18) సహా పలు ప్రముఖ మీడియా సంస్థలు దీన్ని నిర్ధారించాయి. అయితే, ఈ వేడుక పూర్తిగా వ్యక్తిగతంగా నిర్వహించబడడంతో ఇప్పటివరకు అధికారిక ఫోటోలు గానీ, కుటుంబ ప్రకటన గానీ వెలువడలేదని సమాచారం.
వైల్డ్‌లైఫ్ ఫోటోగ్రాఫర్, ఆర్టిస్ట్‌గా గుర్తింపు ఉన్న రెహాన్ వాద్రా ఇప్పటివరకు ఎప్పుడూ లో ప్రొఫైల్‌ను కొనసాగించారు. రాజకీయాలకు దూరంగా తన ఆసక్తులకే ప్రాధాన్యం ఇస్తూ ముందుకెళ్తున్న రెహాన్ వ్యక్తిగత జీవితంలోకి అడుగుపెట్టిన ఈ కొత్త అధ్యాయం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.








