అసెంబ్లీకి కేసీఆర్‌.. భారీ బందోబస్తు

అసెంబ్లీకి కేసీఆర్‌.. భారీ బందోబస్తు

సుదీర్ఘ విరామం అనంతరం బీఆర్ఎస్‌(BRS) పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కే. చంద్రశేఖర్‌రావు (కేసీఆర్‌) తెలంగాణ అసెంబ్లీకి చేరుకున్నారు. కేసీఆర్‌ అసెంబ్లీకి చేరుకున్న నేపథ్యంలో శాసనసభ పరిసరాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లో మూడంచెల భద్రతను అమలు చేస్తూ దాదాపు వెయ్యి మంది పోలీసు సిబ్బందితో భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. నంది నగర్‌లోని తన నివాసం నుంచి కేసీఆర్‌(KCR) నేరుగా అసెంబ్లీకి (Assembly) బయలుదేరి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన వెంట బీఆర్ఎస్‌ సీనియర్‌ నేతలు, ఎమ్మెల్యేలు జగదీష్‌రెడ్డి, ప్రశాంత్‌రెడ్డి ఉన్నారు.

కృష్ణా జలాల పంపిణీ (Krishna River Water Allocation) అంశంపై జరగనున్న శీతాకాల శాసనసభ సమావేశాలు తీవ్ర వాగ్వాదాలకు వేదిక కావచ్చని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ అంశంపై ఇటీవల కేసీఆర్‌ చేసిన ఘాటు వ్యాఖ్యలు, దానికి సీఎం రేవంత్‌రెడ్డి ఇచ్చిన ప్రతిస్పందన, అలాగే కాంగ్రెస్‌–బీఆర్ఎస్‌ నేతల మధ్య కొనసాగుతున్న మాటల యుద్ధం నేపథ్యంలో ఈసారి అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా సాగే అవకాశం కనిపిస్తోంది.

ప్రజాసమస్యలపై విస్తృత చర్చ అవసరమని బీఆర్ఎస్‌ భావిస్తోంది. అందుకే ఈసారి కనీసం 15 రోజుల పాటు శాసనసభ సమావేశాలు నిర్వహించాలని పార్టీ పట్టుబడుతోంది. కృష్ణా జలాల పంపిణీతో పాటు ఇతర కీలక అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు బీఆర్ఎస్‌ వ్యూహాత్మకంగా సిద్ధమవుతోంది.

మాజీ సర్పంచ్‌ల అరెస్టులు
ఈరోజు పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ మాజీ సర్పంచ్‌లు అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చిన నేపథ్యంలో, ముందస్తు చర్యలుగా పోలీసులు పలువురు మాజీ సర్పంచ్‌లను అరెస్ట్‌ చేశారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా శాసనసభ పరిసరాల్లో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment