‘ఆవకాయ్‌ అమరావతి’ ఈవెంట్‌కి బిగ్‌ షాక్‌

‘ఆవకాయ్‌ అమరావతి’ ఈవెంట్‌కి బిగ్‌ షాక్‌

విజయవాడ (Vijayawada) పున్నమిఘాట్‌లో జనవరి 8 నుంచి 10వ తేదీ వరకు టూరిజం శాఖ (Tourism Department) ఆధ్వర్యంలో నిర్వహించనున్న ‘ఆవకాయ్‌ అమరావతి’ (Aavakaay Amaravati) కార్యక్రమానికి బిగ్ షాక్ త‌గిలింది. ప్ర‌భుత్వం ఈ కార్యక్రమం కోసం చేపట్టిన ఏర్పాట్లకు పున్నమిఘాట్ ప్రాంతంలోని ప్రైవేట్ భూముల యజమానులు తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు.

తమను సంప్రదించకుండానే, తమకు చెందిన ప్రైవేట్ పట్టా భూముల్లో కార్యక్రమం నిర్వహించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ భవానీపురం (Bhavanipuram) పున్నమిఘాట్ భూమి యజమానుల సంఘం (Punnami Ghat Land Owners Association) నేతలు మీడియా సమావేశం నిర్వహించి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎగ్జిబిషన్ ఏర్పాట్ల పేరుతో త‌మ భూమి చేప‌ట్టిన త‌మ నిర్మాణాలను కూల్చివేయడం అన్యాయమని వారు ఆరోపించారు. గత 20 ఏళ్లుగా తమ భూములను వివిధ ప్రభుత్వ కార్యక్రమాలకు వాడుకుంటున్నప్పటికీ, రూపాయి పరిహారం కూడా ఇవ్వలేదని వారు తెలిపారు.

20 ఎకరాల ప్రైవేట్ ల్యాండ్‌
పున్నమిఘాట్ ప్రాంతంలో సుమారు 20 ఎకరాల వరకు ప్రైవేట్ పట్టా భూమి ఉన్నట్లు భూమి యజమానులు తెలిపారు. తమ భూములను కాపాడుకునేందుకు గోడలు నిర్మించుకుంటే వాటిని కూడా అధికారులు కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. “మా భూముల్లో ఎవరెవరో చొరబడుతున్నారు. మా స్థలాలకు రక్షణ అవసరం” అని వారు స్పష్టం చేశారు.

పుష్కరాల కాలం నుంచి తమ భూములను ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించుకునేందుకు సహకరిస్తున్నామని, అయినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి పరిష్కారం, పరిహారం, లేదా బిల్లులు ఇవ్వలేదని భూమి యజమానులు ఆరోపించారు. “మా సహనాన్ని పదే పదే పరీక్షిస్తున్నారు. అవకాయ అమరావతి కార్యక్రమం మా భూముల్లో పెట్టేటప్పుడు మమ్మల్ని అడగాల్సిన అవసరం లేదా?” అని ప్రశ్నించారు.

ప్రైవేట్ స్థలాల్లో ఏవైనా కూల్చివేతలు చేపట్టాలంటే ముందస్తు నోటీసులు ఇవ్వాల్సిందేనని యజమానులు గుర్తు చేశారు. “ఏం అడిగినా కలెక్టర్ ఆదేశాలంటున్నారు. కానీ ప్రైవేట్ భూముల్లో ఇలా వ్యవహరించడం చట్టవిరుద్ధం. ఎవరికో మేలు చేసేలా రౌడీల్లా వ్యవహరిస్తే సహించం” అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కలెక్టర్ ఒక నియంతలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు చేశారు.

ప్రభుత్వ కార్యక్రమాలకు సహకరించేందుకు తాము సిద్ధంగానే ఉన్నామని, అయితే తమకు సహకారం లేకపోతే తాము కూడా సహకరించబోమని స్పష్టం చేశారు. అవసరమైతే న్యాయపరంగా ఎదుర్కొంటామని, తమ భూముల పరిరక్షణ కోసం అందరూ ఏకమయ్యామని భూమి యజమానులు వెల్లడించారు. “ప్రభుత్వానికి సహకరిస్తున్నాం కదా అని, మా భూముల నుంచే మమ్మల్ని తరిమేస్తారా?” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment