తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం (SV University)కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్(Associate Professor) అనుమానాస్పదంగా మృతి (Suspicious Death) చెందడం కలకలం రేపింది. ప్రొఫెసర్ గుగులోతు సర్దార్ నాయక్ (Gugulothu Sardar Naik) మృతదేహం అలిపిరి జూపార్క్ రోడ్ పరిధిలో తన సొంత కారులో లభ్యమైంది. మృతుడు తెలంగాణ రాష్ట్రం (Telangana State) మహబూబాబాద్ జిల్లా, మరిపెడ మండలం, తండ ధర్మారం వాసిగా కావడం చర్చనీయాంశంగా మారింది.
కారులో పడుకొని విగతజీవిగా ఉన్న సర్దార్ నాయక్‌ను స్థానిక విద్యార్థుల చూసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఈ ఘటన రెండు రోజుల పాటు ఎవరికీ తెలియకుండా ఉండటంతో మృతిపై మరిన్ని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక విచారణ చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తిరుపతిలోని రుయా ప్రభుత్వ ఆసుపత్రి (Ruya Government Hospital)కి తరలించారు. మృతికి గల అసలు కారణాలు తేల్చేందుకు అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.
ఈ ఘటనలో మరిన్ని కీలక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. సర్దార్ నాయక్ గత మూడు నెలలుగా ఎస్వీ యూనివర్సిటీ ఎంబీఏ విభాగంలో విధులకు సక్రమంగా హాజరు కావడం లేదని పేర్కొంటూ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ఆయనను సస్పెండ్ చేసినట్లు సమాచారం. అంతేకాదు, ఇటీవల మద్యం అలవాటు (Alcohol Addiction)కు బానిసగా మారినట్లు సహచరులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఇది సహజ మరణమా, ఆరోగ్య సమస్యల కారణమా, లేక మరేదైనా కారణమా అనే అనుమానాలు బలపడుతున్నాయి. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల నిజమైన కారణం వెల్లడయ్యే అవకాశముందని పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో ఎస్వీ యూనివర్సిటీ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.








