దేశ పౌర విమానయాన రంగంలో మరో కీలక విషయం బయటకొచ్చింది. ఇప్పటికే విస్తరిస్తున్న ఎయిర్ ట్రాఫిక్‌కు తోడుగా మరో రెండు కొత్త విమానయాన సంస్థలు రంగ ప్రవేశం చేయడానికి సిద్ధమయ్యాయి. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో విమానయాన రంగంలో పోటీ మరింత ఉత్కంఠభరితంగా మారనుంది.
కేంద్ర పౌర విమానయాన శాఖ అల్ హింద్ ఎయిర్ (Al Hind Air), ఫ్లైఎక్స్‌ప్రెస్ (Fly Express) సంస్థలకు నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్లు (NOCs) జారీ చేసింది. దీంతో ఈ రెండు సంస్థలు 2026 నుంచి వాణిజ్య విమాన సేవలు ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. ఈ విషయాన్ని కేంద్ర పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు (Rammohan Naidu) అధికారికంగా వెల్లడించారు. ఇప్పటికే శంఖ్ ఎయిర్‌కు NOC లభించగా, తాజాగా మిగిలిన రెండు సంస్థలకు అనుమతులు మంజూరయ్యాయి.
కేరళ కేంద్రంగా పనిచేస్తున్న అల్ హింద్ గ్రూప్ (Al Hind Group), తొలి దశలో దక్షిణ భారత రూట్లపై దృష్టి సారించనుంది. ప్రారంభంగా ATR-72 టర్బోప్రాప్ విమానాలతో ప్రాంతీయ సేవలు అందించనుంది. అనంతరం దశలవారీగా అంతర్జాతీయ విమాన సేవలు విస్తరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.
ఇక ఫ్లైఎక్స్‌ప్రెస్ (Fly Express) సంస్థ హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న అంతర్జాతీయ, దేశీయ కొరియర్ & కార్గో సేవల కంపెనీతో కలిసి కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ప్రయాణికుల విమాన సేవలకు సంబంధించి విమానాల సంఖ్య, రూట్ల వివరాలు ఇంకా వెల్లడికాలేదు.








