బీఆర్ఎస్ (BRS) అధ్యక్షుడు మళ్లీ యాక్టీవ్ పాలిటిక్స్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. సుదీర్ఘ విరామం తర్వాత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్(KCR) మీడియా ముందుకు వచ్చారు. హైదరాబాద్‌లోని (Hyderabad) తెలంగాణ భవన్లో (Telangana Bhavan) నిర్వహించిన ప్రెస్మీట్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu)పై తీవ్ర స్థాయిలో విమర్శలు, సెటైర్లు గుప్పించారు. కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ వైరల్‌గా మారాయి. చంద్రబాబు వ్యక్తిత్వం గురించి తెలిసిన ఉద్యమ నాయకుడు కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
చంద్రబాబు ఎంవోయూల (MoUs) పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నారని కేసీఆర్ ఆరోపించారు. స్టార్ హోటళ్లలో వంటమనుషులు, హోటల్ సప్లయర్స్‌తో ఎంవోయూలు చేసుకుని వాటిని భారీ పెట్టుబడులుగా ప్రచారం చేయడం చంద్రబాబు ప్రత్యేకత అని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. “2014-19 మధ్య వైజాగ్‌లో చేసుకున్న ఎంవోయూలు ఎక్కడికి పోయాయి? కనీసం రూ.10 వేల కోట్లు అయినా ఏపీకి వచ్చాయా?” అంటూ ప్రశ్నించారు. ఎంవోయూలకు హైప్ క్రియేట్ చేసే గురువు చంద్రబాబేనని, రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులంటూ ఫేక్ ఎంవోయూలతో ప్రజలను మోసం చేశారని విమర్శించారు.
ఇలాంటి ఫేక్ ఎంవోయూలతో (Fake MoUs) నిజంగానే పెట్టుబడులు వస్తే, ఆంధ్రప్రదేశ్‌కు (Andhra Pradesh) ఇప్పటివరకు రూ.20 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చి ఉండేవని కేసీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూడా గురువు బాటలో నడుస్తున్నారని, ఫేక్ ఎంవోయూలకు చంద్రబాబే గురువని ఘాటు వ్యాఖ్యలు చేశారు. గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహబూబ్‌నగర్ జిల్లాను దత్తత తీసుకుని ఇష్టమొచ్చినట్లు పునాది రాళ్లు వేసిన విషయాన్ని కేసీఆర్ గుర్తు చేశారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో సాగునీరు లేక ప్రజలు కరువుతో వలసలు వెళ్లేవారని, అప్పట్లో వేసిన పునాది రాళ్లను తీసుకెళ్లి కృష్ణానదిలో అడ్డంగా పెడితే చెక్‌డ్యామ్ అయ్యేదని ఉద్యమ సమయంలో తాను వ్యాఖ్యానించేవాడినని కేసీఆర్ గుర్తు చేశారు. జూరాల ప్రాజెక్టుకు సంబంధించి కర్ణాటకకు కాంపెన్సేషన్ చెల్లించకుండా చంద్రబాబు పాలమూరు ప్రజలను ఇబ్బంది పెట్టారని ఆరోపించారు.
ఈ అన్యాయాలపై మహబూబ్‌నగర్‌లో ప్రథమ మహాసభ నిర్వహించి చంద్రబాబును నిలదీస్తే, మోకాళ్ల మీద పరిగెత్తి ఆ డబ్బులు కట్టినట్టు కేసీఆర్ చెప్పారు. ఆ తర్వాత చంద్రబాబు పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే ఆర్డీఎస్ను బాంబు పెట్టి పేల్చాడని ఆరోపించారు. ఈ ఘటనకు నిరసనగా జోగులాంబ నుంచి గద్వాల్ వరకు పాదయాత్ర చేసి ప్రజల సమస్యలను ఎండగట్టానని, వెంటనే జూరాల నుంచి ఆర్డీఎస్ లింక్ కెనాల్ అంటూ చంద్రబాబు కొత్త డ్రామా మొదలుపెట్టాడని కేసీఆర్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు, కేసీఆర్ ఇద్దరూ సమకాలికులు కాబట్టి, ఆయన చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేకపోలేదని రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
ఏపీ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలతో కేసీఆర్ మరోసారి రాజకీయ వేడిని రాజేశారు. చంద్రబాబు పాలనపై తీవ్ర ఆరోపణలతో పాటు గత అనుభవాలను గుర్తు చేస్తూ చేసిన వ్యాఖ్యలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి చర్చనీయాంశంగా మారాయి.








