తెలంగాణ రాష్ట్రంలో సంక్రాంతి పండుగ సందర్భంగా కొత్త రేషన్ స్మార్ట్ కార్డులు జారీ చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. కొత్తగా 10 లక్షల కార్డులు మంజూరయ్యే అవకాశం ఉందని ప్రభుత్వ అంచనా. కాగా, కులగణన డేటా ఆధారంగా అర్హుల ఎంపిక చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు మంత్రి ఉత్తమ్. ఈ కొత్త కార్డుల వల్ల 36 లక్షల మంది లబ్ధి పొందనున్నారని మంత్రి వెల్లడించారు.
18 లక్షల దరఖాస్తులు పెండింగ్లో..
కొత్తగా చేర్చిన కుటుంబ సభ్యుల పేర్లతో కూడిన 18 లక్షల దరఖాస్తులు ప్రస్తుతం పెండింగ్లో ఉన్నాయని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వెల్లడించారు. ఈ దరఖాస్తులను పరిశీలించి, తగిన నిబంధనల ప్రకారం మంజూరు చేయనున్నారు.
పంచాయతీలు, గిరిజన తండాల్లో, అవసరమైన ప్రాంతాల్లో కొత్త రేషన్ షాపులు ఏర్పాటు చేస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి వివరించారు. త్వరలో సన్న బియ్యం పంపిణీ చేయనున్నట్లు ప్రకటించారు. ఇతర నిత్యావసర వస్తువుల పంపిణీ ఆలోచన ఇప్పటి వరకైతే లేదని, ఏదన్నా ఉంటే కేబినెట్ ముందు పెట్టి సమష్టిగా నిర్ణయం తీసుకుంటామన్నారు.