ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో అమరావతికి (Amaravati) సమీపంలో ఉన్న గుంటూరు జిల్లాలో డ్రగ్స్ మాఫియా (Drugs Mafia) విజృంభణ తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ప్రభుత్వం డ్రగ్స్ నిర్మూలనపై ఉక్కుపాదం మోపుతున్నామంటూ ప్రకటిస్తున్నా, క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. విద్యార్థులే లక్ష్యంగా (Students as Target) మత్తు పదార్థాల దందా సాగుతుండటం కలకలం రేపుతోంది. కొందరు విద్యార్థులు ముఠాలుగా మారి తామే డ్రగ్స్ వినియోగించడమే కాకుండా, ఇతర యువతులను కూడా ఉచ్చులోకి లాగుతున్నట్లు సమాచారం.
గుంటూరు జిల్లాలో (Guntur District) డ్రగ్స్‌కు బానిసలవుతున్న విద్యార్థినులు మత్తులో ఉన్న సమయంలో వీడియోలు తీసి బ్లాక్‌మెయిల్ చేయడం, మానసికంగా వేధించడం వంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మత్తు ఉచ్చు నుంచి బయటపడలేక పలువురు విద్యార్థినులు విలవిల్లాడుతున్నారు. మత్తులో వికృత చేష్టలకు పాల్పడుతున్న యువతుల ప్రవర్తనతో తల్లిదండ్రులు తీవ్ర మనస్తాపానికి గురవుతున్నారు. ఓ యువతి తీరు మారకపోవడంతో ఆమె తల్లి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన గుంటూరులో కలకలం సృష్టించింది. డ్రగ్స్ రాకెట్‌పై ఎస్పీ వకుల్ జిందాల్ స్పందించారు. బాధిత యువతి తండ్రితో ఈగల్ టీమ్స్ మాట్లాడినట్లుగా సమాచారం.
ఇదిలా ఉండగా, ఆంధ్రప్రదేశ్‌లో తొలిసారిగా కొకైన్ గుంటూరులో పట్టుబడిన విషయం తెలిసిందే. అనంతరం మంగళగిరిలోనూ ఇదే తరహా ఘటన వెలుగులోకి రాగా, విశాఖలో (Visakhapatnam) 25 గ్రాముల డ్రగ్స్ కేసు పెద్ద దుమారం రేపింది. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో గంజాయిని పూర్తిగా నిర్మూలిస్తామని ప్రకటించినప్పటికీ, 18 నెలలు గడిచినా గంజాయి విచ్చలవిడి కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు కొత్తగా కొకైన్ సంస్కృతి విస్తరించడంతో టీనేజర్ల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అసలు విద్యార్థులకు డ్రగ్స్ ఎలా అందుతున్నాయి? ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈగల్ టీమ్ (EAGLE Team) కళ్లుగప్పి మత్తు దందా ఎలా కొనసాగుతోంది? అనే ప్రశ్నలు ప్రజలను వేధిస్తున్నాయి. వరుస డ్రగ్స్ ఘటనలతో గుంటూరు నగరం ఒక్కసారిగా డ్రగ్స్ హాట్‌స్పాట్‌గా మారుతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. యువత భవిష్యత్తును కాపాడేందుకు ప్రభుత్వం మరింత కఠిన చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపిస్తోంది.








