తెలంగాణ (Telangana)లో తొలి దశ గ్రామపంచాయతీ ఎన్నికలకు (Village Panchayat Elections) సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 4,236 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగాల్సి ఉండగా, 395 గ్రామాల్లో సర్పంచ్లు ఇప్పటికే ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అలాగే ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా దాఖలు కాలేదు. దీంతో 3,834 గ్రామాల్లో సర్పంచ్ మరియు 27,628 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఈ గ్రామాల్లో మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను (Polling Stations) ఏర్పాటు చేశారు. గురువారం ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది (Polling Started). రాష్ట్రవ్యాప్తంగా 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
ఈ ఎన్నికల్లో 12,960 మంది సర్పంచ్ అభ్యర్థులు బరిలో ఉండగా, వార్డు సభ్యుల స్థానాలకు 65,455 మంది అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. సర్పంచ్ పదవులకు సగటున 3.38 మంది, వార్డు సభ్యుల స్థానాలకు సగటున 2.36 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. అనంతరం సాయంత్రం ఎన్నికల ఫలితాలు ప్రకటించనున్నారు. ఉపసర్పంచ్ ఎన్నికను కూడా ఇదే రోజు నిర్వహించనున్నారు.








