తెలంగాణ రాష్ట్రం (Telangana State)లో పంచాయతీ ఎన్నికల (Panchayat Elections) హవా నడుస్తోంది. ఎవరికి వారు జోరుగా ప్రచారం నిర్వహించుకుంటున్నారు. ఈ హడావిడిలో కొన్ని విషాద సంఘటనలు కూడా చోటుచేసుకుంటున్నాయి. సంగారెడ్డి జిల్లాలో (Sangareddy District) ఎన్నికల సమయంలో విషాదం నెలకొంది. రాయికోడ్ మండలం పిప్పడ్‌పల్లి గ్రామంలో కాంగ్రెస్ పార్టీ (Congress Party) బలపరిచిన సర్పంచ్ అభ్యర్థిగా (Sarpanch Candidate) పోటీ చేస్తున్న సీహెచ్ రాజు (CH Raju) (36) ఆత్మహత్య (Suicide) చేసుకోవడం స్థానికంగా కలకలం రేపింది.
ఆయన అయ్యప్ప సన్నిధానంలో స్వామి మాలలో ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. తనను పూర్తిగా ఒంటరివాడిని చేశారని, తనకు ప్రచారంలో ఎవరూ మద్దతుగా ఉండడం లేదని తోటి స్వాములతో రాజు బాధ వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల్లో తాను ఓడిపోతానన్న భయం ఆయనను మరింత కలవరపెట్టినట్టు సమాచారం. రాజుకు ధైర్యం చెప్పే ప్రయత్నం చేసినప్పటికీ, రాత్రి అందరూ నిద్రపోయిన తరువాత పక్కనే ఉన్న చెట్టుకు ఉరి వేసుకుని ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.
ఇక మరోవైపు, సంగారెడ్డి జిల్లాలోనే మరో రెండు ప్రదేశాల్లో విషాదకర సంఘటనలు చోటుచేసుకున్నాయి. శంకర్‌పల్లి మండలం మంచర్లగూడ గ్రామం లో పల్లె లత (42), చౌటకూర్ మండలం చక్రియాల గ్రామం లో కొత్తొల్ల పద్మారావు (50) అనే ఇద్దరు వార్డు మెంబర్ అభ్యర్థులు గుండెపోటుతో మృతిచెందారు. ఎన్నికల ఒత్తిడి కారణంగా ఈ ఘటనలు జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఈ మూడు ఘటనలు జిల్లాలో ఎన్నికల వేడి మధ్య విషాద వాతావరణాన్ని నెలకొల్పాయి. స్థానికులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.








