దేశవ్యాప్తంగా ఇండిగో సంక్షోభం ఉధృతంగా కొనసాగుతున్న వేళ, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పనితీరుపై అసంతృప్తి చర్చలు జోరందుకున్నాయి. ఇదే సమయంలో రిపబ్లిక్ టీవీలో జరిగిన డిబేట్లో టీడీపీ అధికార ప్రతినిధి దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు భారీ వివాదానికి దారితీశాయి. ఇండిగో విమానాల రద్దుపై నారా లోకేష్ సమీక్ష చేస్తున్నారని ఆయన చేసిన ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ అవుతూ, దేశవ్యాప్తంగా పెద్ద చర్చకు కారణమైంది.
ఇండిగో విమానాలు వరుసగా రద్దవుతూ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న నేపథ్యంలో, ఈ సంక్షోభాన్ని కూడా ప్రచారం అవకాశంగా మార్చుకునే ప్రయత్నం టీడీపీ చేసింది అన్న విమర్శలు వినిపిస్తున్నాయి. రిపబ్లిక్ టీవీ చర్చలో దీపక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ ప్రయత్నాన్ని పూర్తిగా బోల్తా కొట్టించాయి. దీన్ని పట్టుకున్న ప్రముఖ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి, వెంటనే లోకేష్‌కు సివిల్ ఏవియేషన్ మంత్రిత్వ శాఖతో ఏ సంబంధముందని కఠినంగా ప్రశ్నించారు.
“సివిల్ ఏవియేషన్ శాఖ రామ్మోహన్ నాయుడు ఆధ్వర్యంలో ఉంది. అయితే లోకేష్ ఎందుకు దీనిని మానిటర్ చేస్తున్నారు? శాఖ వ్యవహారాల్లో ఆయన జోక్యం చేసుకోవడానికి ఏ అర్హత ఉంది?” అంటూ అర్నబ్ గోస్వామి సూటిగా ప్రశ్నించడంతో, టీడీపీ అధికార ప్రతినిధి తడబడిపోయారు. ఈ సంఘటన వెంటనే సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. టీడీపీ నాయకులపై ‘అధికార దుర్వినియోగం, అపేక్షలేని ప్రచారం కోసం ప్రయత్నం’ వంటి విమర్శలు వెల్లువెత్తాయి.
ఇండిగో సంక్షోభం కారణంగా దేశంలో వేలాది మంది ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో, కేంద్ర మంత్రిత్వ శాఖ స్పష్టమైన నిర్ణయాలు తీసుకోకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో, టీడీపీ నాయకుడు లోకేష్ సమీక్ష చేస్తున్నారని చెప్పడం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది.ఈ ఘటనతో టీడీపీపై జాతీయ స్థాయిలో నెగెటివ్ ఇమేజ్ ఏర్పడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.









విమానయానంలో ఇండిగో, ఎయిర్ఇండియా ఆధిపత్యం!