ఇండిగో విమానాల రద్దుతో దేశవ్యాప్తంగా కలకలం రేగిన నేపథ్యంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా రంగంలోకి దిగారు. ప్రధానమంత్రి మోడీ ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గత రెండు రోజులుగా ఇండిగో కార్యకలాపాలు స్తంభించిపోవడంతో ప్రయానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాశ్రయాలు అస్తవ్యస్తంగా మారిన పరిస్థితి పట్ల ప్రధాని తీవ్ర ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, సివిల్ ఏవియేషన్ శాఖ మంత్రి పనితీరుపై ప్రధానమంత్రి అసంతృప్తి వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది.
సంక్షోభం తీవ్రమవుతుండడంతో మోడీ స్వయంగా విమానాయన శాఖ ఉన్నతాధికారులను సమీక్షకు పిలిచినట్లుగా సమాచారం. ఇండిగోలో ఏర్పడిన అంతర్గత సమస్యలు, పైలట్ల కొరత, షెడ్యూల్లలో గందరగోళం వంటి అంశాలపై అధికారుల నుంచి పూర్తి స్థాయి వివరాలను తీసుకుంటున్నారని వర్గాలు చెబుతున్నాయి. ఈ కీలక సమీక్షకు కేంద్ర సివిల్ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్ నాయుడుకు ఆహ్వానం లేదని ఢిల్లీ వర్గాల సమాచారం. విమానాయన శాఖ మంత్రి సమీక్షకు పిలవకపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది.
రోజు రోజుకు పెరుగుతున్న ఫ్లైట్ రద్దుల కారణాలను ప్రధాని అడిగి తెలుసుకుని, తక్షణ చర్యలకు ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇండిగో సంక్షోభం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితిలో, సంబంధిత శాఖ మంత్రికి పీఎంఓ నుంచి ఆహ్వానం రాకపోవడం ఆశ్చర్యంగా మారింది. ఇటీవలి రోజుల్లో విమానాయన శాఖ నిర్వహణ, సంక్షోభం ఎదుర్కునే తీరు పట్ల పీఎం అసంతృప్తిగా ఉన్నారని ప్రచారమవుతోంది.









విమానయానంలో ఇండిగో, ఎయిర్ఇండియా ఆధిపత్యం!