పైరసీ కేసులో అరెస్టై జైలు జీవితం గడుపుతున్న ఐబొమ్మ రవి విషయంలో విచారణలో భాగంగా కీలక విషయాలు బయటపడుతున్నాయి. రవికున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని గుర్తించిన కొంతమంది ఉన్నతాధికారులు, అతనికి సైబర్ క్రైమ్ విభాగంలో ఉద్యోగ ఆఫర్ చేసినట్లు సమాచారం. అయితే, ఈ ఆఫర్ను రవి తిరస్కరించినట్లు తెలిసింది.
విచారణలో రవి మాట్లాడుతూ, తాను చేసిన తప్పును గ్రహించానని, ఇకపై పైరసీ జోలికి వెళ్లనని స్పష్టం చేశాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత కరీబియన్ దీవుల్లో ఒక రెస్టారెంట్ ప్రారంభించాలని ఉందని రవి వెల్లడించాడు. తాను పైరసీ ద్వారా సంపాదించిన రూ. 17 కోట్లను పూర్తిగా వినోదం (ఎంజాయ్) కోసమే ఖర్చు చేశానని విచారణలో చెప్పినట్లు సమాచారం.
సోషల్ మీడియాలో రవికి భారీ మద్దతు
మరోవైపు, ఐబొమ్మ రవి బెయిల్ పిటిషన్పై నాంపల్లి కోర్టు ఈరోజు కాసేపట్లో తీర్పు వెలువరించనుంది. రవి అరెస్ట్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో అతనికి పెద్ద ఎత్తున మద్దతు లభిస్తోంది. సినీ పరిశ్రమలో పైరసీకి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నప్పటికీ, కొందరు సినీ నిర్మాతలు సైతం ఐబొమ్మ రవిని ‘రాబిన్హుడ్’ తో పోలుస్తూ మాట్లాడుతున్నారంటే, అతనికి ఉన్న ఫాలోయింగ్ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈ కేసులో న్యాయస్థానం ఇచ్చే తీర్పు కోసం తెలుగు ప్రేక్షకులు, సైబర్ ప్రపంచం ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.








