యంగ్ టైగర్ ఎన్టీఆర్ (Young Tiger NTR), కొరటాల శివ (Koratala Siva) కాంబినేషన్‌లో వచ్చిన బ్లాక్‌బస్టర్ హిట్ ‘దేవర’ (2024) రూ. 500 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘దేవర 2’ (Devara 2) ఉంటుందని మేకర్స్ ప్రకటించారు. అయితే, ఈ సీక్వెల్ షూటింగ్ వాయిదా పడుతూ, ఎన్టీఆర్ ఇతర ప్రాజెక్టులను లైన్‌లో పెట్టడంతో ‘దేవర 2’ క్యాన్సిల్ అయిందనే వార్తలు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి.
గతంలో ఎన్టీఆర్ స్వయంగా ‘దేవర 2’ ఉంటుందని ప్రకటించినప్పటికీ, ఆయన నటించిన బాలీవుడ్ సీక్వెల్ ‘వార్ 2’ డిజాస్టర్ కావడంతో సీక్వెల్స్ విషయంలో ఎన్టీఆర్ కొంత సందేహంలో ఉన్నారనే చర్చ మొదలైంది. ఈ కారణంగానే ‘దేవర 2’ వాయిదా పడుతుందని పుకార్లు బలంగా వినిపిస్తున్నాయి.
అయినప్పటికీ, తాజా సమాచారం ప్రకారం, ‘దేవర 2’ ప్రాజెక్ట్ రద్దు కాలేదు, ఖచ్చితంగా ఉంటుందని చిత్ర యూనిట్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. దర్శకుడు కొరటాల శివ ఇప్పటికే సీక్వెల్‌కు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌ను పూర్తి చేసి, ఎన్టీఆర్ సూచనల మేరకు మార్పులు కూడా చేశారట. ప్రస్తుతం ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’, ఆ తర్వాత త్రివిక్రమ్, నెల్సన్ సినిమాలను పూర్తి చేయాల్సి ఉంది. ఈ భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతే ‘దేవర 2’ పట్టాలెక్కే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ‘వార్ 2’ ఫలితం కారణంగా సీక్వెల్ విషయంలో కొంత విరామం తీసుకునేందుకే ఎన్టీఆర్ దీనిని పక్కన పెట్టారు తప్ప, ఈ ప్రాజెక్ట్‌ను పూర్తిగా రద్దు చేయలేదని మేకర్స్ తేల్చి చెబుతున్నారు.








