దక్షిణ బంగాళాఖాతంలో ఏర్పడిన “దిత్వా” తుఫాన్ ఉత్తర దిశగా వేగంగా కదులుతూ భయాందోళనలు సృష్టిస్తోంది. శ్రీలంకలో భారీ నష్టం కలిగించిన ఈ తుపాన్, ఈరోజు భారత తీరానికి సమీపంలోకి చేరే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. దిత్వా ప్రభావంతో దక్షిణ భారత రాష్ట్రాల్లో భారీ వర్షాలు, బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. ఇప్పటికే తమిళనాడు, పుదుచ్చేరి, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కేరళ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు IMD రెడ్, ఆరెంజ్ అలర్ట్‌లు ప్రకటించింది.
తమిళనాడులో ఇప్పటికే తుఫాన్ ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. రామేశ్వరం, పుదుచ్చేరితోపాటు తంజావూరు, తిరువారూర్, విల్లుపురం, కడలూరు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో రవాణా పూర్తిగా స్థంభించగా, కొన్ని గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. భద్రతా కారణాల రీత్యా అనేక జిల్లాల్లో పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించారు. ప్రజలు అత్యవసర మినహా బయటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.
ఇక కొద్ది రోజుల క్రితం శ్రీలంకలో దిత్వా తీవ్రమైన విధ్వంసం సృష్టించింది. వరదలు, కొండచరియలు వల్ల ఇప్పటివరకు 60 మందికి పైగా మరణించారు. ఇంకా అనేక మంది గల్లంతయ్యారు. ఈ నేపథ్యంలో భారత్, ‘ఆపరేషన్ సాగర్ బంధు’ కింద అత్యవసర సహాయక బృందాలను శ్రీలంకకు పంపి సహాయక చర్యలు చేపడుతోంది.
దిత్వా ప్రభావం కొనసాగుతుండగా వాతావరణ శాఖ మరో ముఖ్య హెచ్చరిక జారీ చేసింది. రాబోయే రోజుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు 2–4 డిగ్రీలు తగ్గే అవకాశం ఉంది. ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత మరింత పెరుగుతుండగా, ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు 10 డిగ్రీల కంటే తక్కువకు పడిపోయాయి. మధ్యప్రదేశ్, తూర్పు రాజస్థాన్, పశ్చిమ మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్ ప్రాంతాల్లో మాత్రం ఉష్ణోగ్రతలు కొద్దిగా పెరుగుతాయని IMD స్పష్టం చేసింది.








