ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత సీఎం చంద్రబాబుపై వైసీపీ ప్రభుత్వం కాలంలో నమోదైన ఫైబర్ నెట్ కేసు క్లోజ్ అయ్యింది. అప్పటి ఫైబర్ నెట్ ఎండీ మధుసూదన్ రెడ్డి చేసిన ఫిర్యాదు ఆధారంగా సీఐడీ ఈ కేసును నమోదు చేసింది. అయితే, ప్రస్తుతం ఆయన ఎలాంటి ఆధారాలు లేవని కోర్టులో స్పష్టం చేయడంతో, కేసు మూసివేతకు అంగీకారం తెలిపింది. దీంతో చంద్రబాబు సహా మరో 15 మందికి ఉపశమనం లభించింది.
ఇదిలా ఉండగా, సీఎం చంద్రబాబుపై గతంలో నమోదైన కేసుల కొట్టివేతపై పబ్లిక్ ప్రాసిక్యూటర్, న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి మధ్య కోర్టులో వాగ్వాదం జరిగింది. ప్రత్యేకంగా అసైన్డ్ భూముల వ్యవహారానికి సంబంధించిన కేసులో గురువారం కోర్టులో ఇద్దరి మధ్య తీవ్ర వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి.
ప్రభుత్వోద్యోగులు సాక్షులై ఉండటంతో వారిపై ఒత్తిడి తెచ్చి కేసులను కొట్టివేయించుకుంటున్నారని పొన్నవోలు వాదించారు. చంద్రబాబు కేసుల్లో ఇచ్చిన ఉత్తర్వుల సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని కోరిన పొన్నవోలుకు, కేసుతో సంబంధం లేని థర్డ్ పార్టీకి ఎలా ఇస్తామని పీపీ ప్రశ్నించారు. దీనిపై కోర్టు తీర్పుల ఆధారంగా సర్టిఫైడ్ కాపీలు ఇవ్వాలని పొన్నవోలు పట్టుబట్టారు. ప్రజా ప్రయోజనాలకు సంబంధించిన కేసుల్లో ఎవరికైనా ఈ హక్కు ఉందని ఆయన స్పష్టం చేశారు.
అసైన్డ్ భూముల కేసు కొట్టివేతకు సంబంధించిన ఉత్తర్వుల కాపీలు తప్పనిసరిగా ఇవ్వాలని పొన్నవోలు కోరగా, ఇవ్వలేమైతే ఆ విషయంలో లిఖితపూర్వక స్పష్టీకరణ ఇవ్వాలని కూడా డిమాండ్ చేశారు. ఈ వ్యవహారం రాజకీయంగా కూడా చర్చనీయాంశంగా మారింది.








