సూపర్‌స్టార్ రజనీకాంత్ (Rajinikanth) హీరోగా ‘జైలర్ 2’ (Jailer 2) తెరకెక్కించే పనిలో నిమగ్నమై ఉన్నారు. రిలీజ్‌కు ముందు నుంచే అంచనాలు పెంచుతున్న ఈ సీక్వెల్‌కు సంబంధించి తాజాగా ఒక ఆసక్తికరమైన వార్త వైరల్ అవుతోంది. ఈ చిత్రంలో ఒక స్టార్ హీరో ప్రత్యేక పాత్ర (Cameo) పోషిస్తున్నారని, ప్రస్తుతం ఆయనకు సంబంధించిన కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని సమాచారం. గతంలోనే ‘జైలర్ 2’లో పలువురు ప్రముఖ తారలు అతిథి పాత్రల్లో కనిపించవచ్చని చిత్ర యూనిట్ హింట్ ఇచ్చింది. ఈ నేపథ్యంలో, ఆ స్టార్ హీరో ఎవరై ఉంటారనే చర్చ సినీ వర్గాల్లో జోరుగా నడుస్తోంది.
తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం, ఆ స్టార్ హీరో మరెవరో కాదు, ‘మక్కల్ సెల్వన్’ (Makkal Selvan) విజయ్ సేతుపతి అని తెలుస్తోంది. ప్రస్తుతం గోవా (Goa)లో సేతుపతికి సంబంధించిన సన్నివేశాల షూటింగ్ జరుగుతోందని టాక్ వినిపిస్తోంది. గతంలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో వచ్చిన ‘పెట్టా’ సినిమాలో రజనీకాంత్, విజయ్ సేతుపతి కలిసి నటించారు.
అయితే, ‘జైలర్ 2’లో సేతుపతి నిజంగానే నటిస్తున్నారా అనే విషయంపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈలోగా, విజయ్ సేతుపతి ఇటీవల ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఒక పాన్ ఇండియా సినిమా చిత్రీకరణను పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే, ‘పూరీ హీరో’ రజినీకాంత్ సినిమాలో భాగం అయ్యాడనే వార్తలు వైరల్‌గా మారుతూ, అభిమానుల్లో అంచనాలను మరింత పెంచుతున్నాయి.








