సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. రేపు ప్రమాణ స్వీకారం

సీజేఐగా జస్టిస్ సూర్యకాంత్.. రేపు ప్రమాణ స్వీకారం

దేశ న్యాయవ్యవస్థలో కీలకమైన మార్పు రేపు చోటుచేసుకోనుంది. సుప్రీంకోర్టు (Supreme Court) నూతన ప్రధాన న్యాయమూర్తి (Chief Justice)గా జస్టిస్ సూర్యకాంత్ (Justice Surya Kant) ప్రమాణం స్వీకరించనున్నారు. రాష్ట్రపతి భవన్‌ (Rashtrapati Bhavan)లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (President Droupadi Murmu) ఆయనతో ప్రమాణం చేయనున్నారు. 2027 ఫిబ్రవరి 9 వరకు ఆయన సీజేఐగా కొనసాగనున్నారు. ప్రస్తుత సీజేఐ జస్టిస్ బీఆర్ గవాయ్ (Justice B.R. Gavai) పదవీ విరమణ చేయనున్నారు. ఆయన స్థానంలో జస్టిస్ సూర్యకాంత్ బాధ్యతలు చేపట్టనున్నారు.

జస్టిస్ సూర్యకాంత్ ఇప్పటి వరకు పలువురు చర్చనీయాంశమైన కేసుల్లో కీలక తీర్పులు ఇచ్చారు. ముఖ్యంగా పెగాసస్, ఆర్టికల్ 370 రద్దు కేసు, బీహార్ ఎస్‌ఐఆర్ కేసులు వంటి దేశ ప్రాధాన్యానికి సంబంధించిన అంశాల్లో ఆయన తీర్పులు విశేషంగా నిలిచాయి. న్యాయవ్యవస్థలో పారదర్శకత, న్యాయనిర్ణయాల్లో సమానత్వం అనే సిద్ధాంతాలపై ఎప్పుడూ దృష్టి సారించిన న్యాయమూర్తిగా ఆయనకు మంచి పేరు ఉంది.

స్వదేశీ న్యాయ సిద్ధాంతాల ప్రాముఖ్యతను ఎత్తిచూపడంలో జస్టిస్ సూర్యకాంత్ కీలక పాత్ర పోషించారు. భారత న్యాయ వ్యవస్థ ఇప్పటికీ వలస పాలన నాటి పద్ధతులను అనుసరిస్తోందని, వాటిని ప్రజల అవసరాలకు అనుగుణంగా మార్చాల్సిన అవసరం ఉందని ఆయన పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ప్రజలందరికీ అందుబాటులో ఉండే న్యాయవ్యవస్థ నిర్మాణం కోసం చట్టపరమైన విధానాలు తాజాగా రూపుదిద్దుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

దేశంలో న్యాయం అందరికీ చేరాలంటే సాంకేతిక అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉందని జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. కేసుల పరిష్కారానికి నిర్ధిష్ట గడువులు, న్యాయ వ్యవస్థలో సమయానుకూల నియామకాలు తప్పనిసరి అని ఆయన అభిప్రాయపడ్డారు. వలస పాలన నాటి కోర్టులు సామ్రాజ్యవాద ప్రయోజనాలను కాపాడేందుకు ఉద్దేశించగా, ఆధునిక న్యాయ వ్యవస్థ ప్రజల సమస్యలను పరిష్కరించేలా తీర్చిదిద్దాలి అని ఆయన స్పష్టం చేశారు. భారత న్యాయరంగంలో సంస్కరణలకు ఆయన నాయకత్వం ఎంత దోహదం చేస్తుందో అన్నది ఆసక్తికరం.

Join WhatsApp

Join Now

Leave a Comment