ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)లో మావోయిస్టుల (Maoists) చొరబాటు కలకలం రేపుతోంది. ఇవాళ ఉదయం అల్లూరి జిల్లాలో మావోయిస్టు అగ్రనేత హిడ్మా మరణం (Hidma Death) సంచలనంగా మారగా, ఆ వెంటనే విజయవాడ (Vijayawada)లో మావోల కదలికల నేపథ్యంలో భద్రతా దళాలు భారీ ఆపరేషన్ చేపట్టాయి. కానూరు న్యూ ఆటోనగర్ ప్రాంతంలో అనుమానాస్పదంగా తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో, ఆక్టోపస్ బలగాలు స్థానిక పోలీసుల సహకారంతో దాడులు నిర్వహించాయి. ఈ ఆపరేషన్‌లో ఛత్తీస్‌గఢ్ (Chhattisgarh) కు చెందిన 27 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశారు. అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు ఉండడం పోలీసులను మరింత అప్రమత్తులను చేసింది.
అరెస్టయిన వారిలో నలుగురు కీలక మావోయిస్టు నాయకులు ఉన్నారని సమాచారం. అంతర్గత కార్యకలాపాలకు ఉపయోగపడే విధంగా నగర పరిసరాల్లో మావోయిస్టులు నలుగురు ప్రాంతాల్లో డంప్‌లు ఏర్పాటు చేసినట్టు సమాచారం రావడంతో, వాటికోసం శోధనలు కొనసాగుతున్నాయి. నగరంలోనే ఇంత మంది మావోయిస్టులు ఒకేసారి పట్టుబడటం ఇటీవలి కాలంలోనే పెద్ద సంచలనం.
కేవలం విజయవాడ కానూరులోనే కాకుండా, కృష్ణా జిల్లా, విజయవాడ నగరం, కాకినాడలో కూడా ఒకేసారి దాడులు జరిపిన పోలీసులు మొత్తం 31 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. వీరిలో 9 మంది సెంట్రల్ కమిటీ స్థాయి సభ్యులు ఉన్నట్లు అధికార వర్గాలు నిర్ధారించాయి. వీరి అరెస్టుతో ఆంధ్రప్రదేశ్‌లో మావోయిస్టుల కొత్త రహస్య నెట్‌వర్క్ బయటపడిందని తెలుస్తోంది.
అరెస్టయిన మావోయిస్టులు రాష్ట్రంలో ప్రధాన కార్యకలాపాలు విస్తరించే ప్రయత్నంలో ఉన్నారని అనుమానం వ్యక్తమవుతోంది. నగరాల్లో డంప్‌లు ఏర్పాటు చేయడం, కీలక నాయకుల హాజరు, మహిళా దళ సభ్యుల పెద్ద సంఖ్యలో ఉండడం ఇవి మావోయిస్టులు వ్యూహాత్మక మార్పులు చేస్తున్న సూచనలుగా పోలీసులు పేర్కొంటున్నారు. ఈ కేసులో మరికొన్ని ముఖ్యమైన విషయాలు బయటపడే అవకాశం ఉన్నందున దర్యాప్తు వేగంగా కొనసాగుతోంది.








