ఐబొమ్మ (iBomma) పైరసీ (Piracy) వ్యవహారంపై హైదరాబాద్ కమిషనర్ వీసీ సజ్జనార్ (V.C. Sajjanar) కీలక ప్రకటన చేశారు. ఐబొమ్మ రవి(Ravi)పై ఐటీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రవి వల్ల సినిమా పరిశ్రమకు చాలా పెద్ద నష్టం జరిగిందని, దీని వెనుక చాలా పెద్ద రాకెట్ ఉందని ఆయన స్పష్టం చేశారు. ఈ రాకెట్‌లో 1970 నుంచి ఇప్పటివరకు విడుదలైన సినిమాలన్నీ రవి వద్ద ఉన్నాయని, నిందితుడు రవి స్వస్థలం విశాఖపట్నం అని వెల్లడించారు.
అంతేకాకుండా, రవి పలు పేర్లతో లైసెన్స్‌లు, పాన్ కార్డులు కలిగి ఉన్నాడని, అతడి కోసం చాలా మంది పోలీసులు గాలించారని పేర్కొన్నారు. ఐబొమ్మ రాకెట్‌ను ఛేదించడానికి జాతీయ సంస్థల సహకారం తీసుకుంటామని సజ్జనార్ తెలిపారు. నిందితుడు కొత్త టెక్నాలజీని ఉపయోగించి సినిమాలను అప్‌లోడ్ చేసేవాడని, అతడికి అంతర్జాతీయ లింకులు కూడా ఉన్నాయని వివరించారు. సినిమా విడుదలైన సాయంత్రానికే ఐబొమ్మలోకి వచ్చేదని పేర్కొన్నారు.
రవి ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్‌ల కారణంగా చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారని సజ్జనార్ తెలిపారు. ఐబొమ్మ వెనుక చాలా డార్క్ వెబ్ సైట్లు ఉన్నాయని, రవి వల్ల చాలా మంది డిజిటైలర్లు కూడా అరెస్ట్ అయ్యారని పేర్కొన్నారు. రవి వద్ద నుంచి రూ. 3 కోట్ల నగదు, ల్యాప్‌టాప్‌లను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. ఐబొమ్మ రవి పోలీసులకే సవాలు విసిరాడని సజ్జనార్ తెలిపారు. కేసులో మిగిలిన నిందితులు ఎక్కడ ఉన్నా పట్టుకుంటామని, పైరసీలో సినిమాలు చూసేవారిపై కూడా నిఘా ఉంచుతామని ఆయన హెచ్చరించారు.








