మాజీ స్పీకర్, తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party–TDP) సీనియర్ సీనియర్ నాయకుడు యనమల రామకృష్ణుడు (Yanamala Ramakrishnudu) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తుని నియోజకవర్గ టీడీపీ విస్తృతస్థాయి సమావేశంలో యనమల చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. ప్రతిపక్ష శక్తిని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదని, వారికి ఉన్న బలం మన రాజకీయ వ్యవహారాలను ప్రభావితం చేస్తుందని స్పష్టం చేశారు.
యనమల మాట్లాడుతూ.. “నేను ప్రతి రోజు సాక్షి పేపర్ చదువుతాను… సాక్షి టీవీ చూస్తాను. ప్రతిపక్షంను గమనించడం చాలా ముఖ్యం. వాళ్ల బలం ఎట్లా ఉందో తెలుసుకుని, దానికి తగ్గట్టు మనం పనిచేయాలి. ‘ప్రతిపక్షం ఏముంది రా… ఊదితే ఎగిరిపోతారు’ అనుకుంటే పెద్ద తప్పు. అసలు వాళ్లు ఊదితే మనమే ఎగిరిపోవాల్సి వచ్చే రోజులుంటాయి” అని వ్యాఖ్యానించారు.
ఇటీవలి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ (Medical Colleges Privatization)కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలు రాష్ట్రవ్యాప్తంగా జనసామాన్యాన్ని కదిలించాయని, ఆ ర్యాలీల కోసం గ్రామాల నుంచి ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్షం ఈ విషయంలో తీవ్ర స్థాయిలో కసితో వ్యవహరిస్తోందన్నారు.
43 ఏళ్ల రాజకీయ ప్రస్థానంపై మాట్లాడిన యనమల, “నేను కోరుకున్న పదవి మాత్రం నాకు దక్కలేదు. రాజ్యసభ సభ్యుడిగా చేయాలనేది నా ఆశ. అది వస్తుందా రాదా అనేది తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం. నేను జీవితంలో ఏ పదవీ అడగలేదు… అవే నన్ను వెతుక్కొని వచ్చాయి” అని తెలిపారు. తుని టిడిపి సమావేశంలో యనమల చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలోనూ ఆసక్తికర చర్చకు దారితీశాయి.








