టీమిండియా (Team India) యువ వికెట్ కీపర్, వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ (Rishabh Pant) శుక్రవారం (నవంబర్ 14) నుంచి కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ (Eden Gardens)లో భారత్ (India), దక్షిణాఫ్రికా (South Africa) మధ్య ఆరంభం కానున్న తొలి టెస్ట్ మ్యాచ్‌తో అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయనున్నాడు. ఇంగ్లాండ్ టెస్ట్ సిరీస్‌లో మాంచెస్టర్ వేదికగా జరిగిన నాలుగో మ్యాచ్‌లో కాలికి గాయమైన కారణంగా దాదాపు నాలుగు నెలలు జట్టుకు దూరమైన పంత్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఖాయమైంది.
ఈ సందర్భంగా పంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. గాయం తర్వాత మైదానంలోకి తిరిగి అడుగుపెట్టడం అంత తేలికైన విషయం కాదని పంత్ పేర్కొన్నాడు. “గాయం తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లోకి పునరాగమనం చేయడం చాలా కష్టం. కానీ ఆ దేవుడు ఎంతో దయగలవాడు, నన్ను ఎన్నోసార్లు ఆశీర్వదించాడు, ఈసారి కూడా కరుణించాడు. మైదానంలోకి తిరిగి రావడం పట్టలేని ఆనందంగా ఉంది. ఈ కోలుకునే సమయంలో నా పేరెంట్స్, సన్నిహితులు అందించిన మద్దతుకు వారికి ధన్యవాదాలు,” అని పంత్ భావోద్వేగానికి లోనయ్యాడు.
అదృష్టం అనేది మన చేతుల్లో ఉండదని, అందుకే తన నియంత్రణలో ఉన్న విషయాల మీదే దృష్టి పెడతానని రిషబ్ పంత్ తెలిపాడు. మనకు నచ్చిన పనులనే చేస్తూ, ఏ పని చేసినా ఆస్వాదిస్తూ, దానిపై 100 శాతం కృషి చేయాలని పంత్ యువతకు సూచించాడు. కాగా, దక్షిణాఫ్రికా ‘ఏ’ తో జరిగిన తొలి అనధికారిక మ్యాచ్‌లో పంత్ కేవలం 20 బంతుల్లోనే ఔటై నిరాశపరిచాడు. ఈ నేపథ్యంలో, శుక్రవారం నుంచి ఆరంభం కానున్న కోల్‌కతా టెస్టులో పంత్ ఫామ్‌లోకి వచ్చి రాణించాలని అభిమానులు బలంగా కోరుకుంటున్నారు.








