అమాయక మహిళలకు డబ్బు ఆశ చూపించి, ధనవంతులైన రోగులకు కిడ్నీలు విక్రయించే దందా వెలుగులోకి వచ్చింది. అన్నమయ్య జిల్లా మదనపల్లిలో కిడ్నీ రాకెట్ సంచలనం సృష్టిస్తోంది. ఎస్‌బిఐ కాలనీలోని గ్లోబల్ ఆసుపత్రి (Global Hospital) వేదికగా అక్రమంగా జరుగుతున్న ఈ దందా ఓ మహిళ మృతితో ఈ దారుణం బయటపడింది. కిడ్నీ మార్పిడి (Kidney Racket) ప్రక్రియలో యమునా (Yamuna) అనే మహిళ మృతిచెందింది. ఆమె మృతదేహాన్ని రహస్యంగా తరలించే ప్రయత్నంలో నిర్వాహకులు పట్టుబడ్డారు. మదనపల్లె పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ కిడ్నీ రాకెట్‌లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి (Madanapalle Government Hospital) డయాలసిస్ సెంటర్ ఇన్‌ఛార్జ్ బాలరంగడు, పుంగనూరు సెంటర్ ఇన్‌ఛార్జ్ బాలాజీ నాయక్, అలాగే విశాఖ మధురవాడకు చెందిన బ్రోకర్లు పద్మ (Padma), కాకర్ల సత్య (Kakarla Satya), వెంకటేష్ (Venkatesh) కీలకపాత్ర పోషించినట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో గుర్తించారు.
డయాలసిస్ కోసం వచ్చే ధనవంతులైన రోగులను గుర్తించి, డబ్బులు ఖర్చు పెడితే కిడ్నీ ఏర్పాటు చేస్తామని బేరాలు కుదుర్చుకునేవారని సమాచారం. విశాఖపట్నం నుంచి బ్రోకర్ల ద్వారా బాధితులను మదనపల్లికి రప్పించి అక్రమ మార్పిడులు చేస్తున్నట్టు బయటపడింది.
విశాఖ మధురవాడకు చెందిన సూరిబాబు భార్య యమున కిడ్నీ తీసుకునేందుకు బేరం కుదుర్చుకుని,అక్కడి నుంచి ఆదివారం మదనపల్లెకు యమునను మదనపల్లె గ్లోబల్ ఆసుపత్రికి తరలించారు. కిడ్నీ తీసే సమయంలో వైద్యం వికటించి యమున మృతిచెందింది. ఈ విషయాన్ని భర్త సూరిబాబుకు తెలియకుండా, బయటకు పొక్కనీయకుండా, గుట్టు చప్పుడు కాకుండా మృతదేహాన్ని వైజాగ్ కు తరలించే ప్రయత్నం చేశారు.
మృతురాలి భర్త సూరిబాబు 112కు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించారు. తిరుపతి ఈస్ట్ సీఐ శ్రీనివాసులు మృతదేహం ఆధారంగా విచారణ చేపట్టి వివరాలు రాబట్టారు. గ్లోబల్ ఆసుపత్రికి ఎలాంటి అనుమతులు లేకుండానే కిడ్నీ మార్పిడులు జరుగుతున్నాయని పోలీసులు తెలిపారు. ఈ ఘటనలో డాక్టర్ అవినాష్, డాక్టర్ శాశ్వతి, అలాగే బ్రోకర్‌గా వ్యవహరించిన నీరజ్‌లను అదుపులోకి తీసుకున్నారు.
ఈ కేసులో ఉన్న డాక్టర్ అవినాష్ తండ్రి డాక్టర్ ఆంజనేయులు చిత్తూరు డిసిహెచ్ఎస్‌గా పనిచేస్తున్నారు. ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకొని కిడ్నీ మార్పిడికి ఎలాంటి అనుమతులు లేకపోయినా కిడ్నీ మార్పిడిలు చేస్తూ ధనవంతులైన రోగుల నుంచి లక్షల్లో వసూలు చేస్తూ యధేచ్ఛగా వ్యాపారాలు చేస్తున్న వైనం బయటపడింది.








