ఏపీ (AP)లో సంచలనం రేపిన ఐదో తరగతి విద్యార్థిని రంజిత (Ranjitha) అనుమానాస్పద మరణం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. బాలిక ఆత్మహత్య చేసుకోలేదని, ఇది స్పష్టంగా హత్య కేసు (Murder Case) అని జిల్లా ఎస్పీ రాహుల్ మీనా (Rahul Meena) కీలక ప్రకటన చేశారు. గత నాలుగు రోజుల క్రితం రామచంద్రపురం (Ramachandrapuram)లో చోటుచేసుకున్న ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపింది.
భాష్యం పబ్లిక్ స్కూల్లో (Bhashyam Public School) ఐదో తరగతి చదువుతున్న రంజిత, తన ఇంట్లో ఫ్యాన్‌కి ఉరివేసుకొని మృతిచెందిన ఘటనగా మొదట నమోదైంది. అయితే, బాలిక తల్లి ఇది ఆత్మహత్య కాదని, ఎవరైనా హత్య చేసి ఉరేసారని ఆరోపించారు. మృతురాలి తల్లి అనుమానించినట్లుగానే బాలిక సూసైడ్ చేసుకోలేదు.. చంపేసి ఉరేసుకున్నట్లుగా ఓ డ్రామాను చిత్రీకరించారని పోలీసులు తేల్చారు. కేసు వెనుక ఉన్న నిజాలను బహిర్గతం చేశారు.
ఎస్పీ రాహుల్ మీనా వివరాల ప్రకారం.. రంజిత హత్య చేసిన వ్యక్తి శ్రీనివాస్ (Srinivas) అని నిర్ధారణ అయ్యింది. ఆయన రామచంద్రపురంలో జిరాక్స్ షాపులో పనిచేస్తూ, ఆర్థిక సమస్యల్లో చిక్కుకున్నాడు. అదే సమయంలో రంజిత కుటుంబానికి పరిచయమున్న శ్రీనివాస్, సాయంత్రం ఐదున్నర సమయంలో వారి ఇంటికి వెళ్లి దొంగతనం చేయడానికి ప్రయత్నించాడని, ఆ సమయంలో రంజితను హతమార్చినట్లు పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి ఇంతకుముందు ఆ ఇంట్లో ఎలక్ట్రికల్ పనుల కోసం వెళ్లిన అనుభవం ఉందని విచారణలో తేలింది.
“టెక్నికల్ ఎవిడెన్స్ కోసం మేము సేకరణ చేస్తున్నారు. మెడికల్ రిపోర్ట్స్ కూడా రావాల్సి ఉంది. బాలికపై అఘాయిత్యం జరిగిందా లేదా అన్నది ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ వచ్చిన తర్వాత స్పష్టమవుతుంది” అని ఎస్పీ రాహుల్ మీనా తెలిపారు. ఈ ఘటనతో రామచంద్రపురంలో విషాద వాతావరణం నెలకొంది. రంజిత కుటుంబం ఆవేదనలో మునిగిపోయింది. ఐదో తరగతి బాలిక కేసు ఏపీలో సంచలనంగా మారింది.








