దేశ రాజధాని ఢిల్లీ (Delhi)లోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో (IGI Airport) ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) వ్యవస్థలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీని ఫలితంగా 500కి పైగా విమానాలు (Flights) ఆలస్యమవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ప్రతిరోజూ దాదాపు 1,500 విమానాలు రాకపోకలు సాగించే ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లో గురువారం సాయంత్రం నుంచే ఈ సమస్యలు ప్రారంభమయ్యాయి. శుక్రవారం కూడా పరిస్థితి మారకపోవడంతో వందలాది మంది ప్రయాణికులు గంటల తరబడి విమానాశ్రయంలోనే ఇరుక్కుపోయారు.
ప్రయాణికుల అవస్థలు
విమానాలు సమయానికి బయలుదేరకపోవడంతో ప్రయాణికుల ఆగ్రహం సోషల్ మీడియాలో వెల్లువెత్తింది. చాలా మంది తమ గమ్యస్థానాలకు సమయానికి చేరుకోలేకపోవడంతో ఎయిర్‌లైన్ కంపెనీలను మరియు సివిల్ ఏవియేషన్ మంత్రిని, ఎయిర్‌పోర్ట్ అధికారులను ట్యాగ్ చేస్తూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలతో, వృద్ధులతో, విదేశీ ప్రయాణికులతో పాటు వ్యాపార ప్రయాణికులు కూడా తీవ్ర అసౌకర్యాన్ని ఎదుర్కొంటున్నారు.
సాంకేతిక లోపం కారణం ఇదే
అధికారుల సమాచారం ప్రకారం, ఎయిర్‌పోర్ట్‌లోని ఆటోమేటిక్ మెసేజ్ స్విచింగ్ సిస్టమ్ (AMSS) లోపం కారణంగానే ఈ ఇబ్బందులు తలెత్తాయి. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్‌జెట్ వంటి ప్రధాన ఎయిర్‌లైన్ సంస్థలు ఇప్పటికే ప్రకటనలు విడుదల చేస్తూ “ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నాం. సమస్య పరిష్కారానికి మా సిబ్బంది తీవ్రంగా కృషి చేస్తున్నారు” అని తెలిపాయి. ప్రస్తుతం సాంకేతిక బృందాలు సమస్యను గుర్తించి సరిచేసే పనిలో ఉన్నాయని, త్వరలోనే విమాన సర్వీసులు సాధారణ స్థితికి వస్తాయని అధికారులు తెలిపారు.








