టీడీపీలో అంతర్గత ఘర్షణలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. తిరువూరు నియోజకవర్గంపై కొనసాగుతున్న కొలికపూడి – కేశినేని చిన్ని వివాదం ఇప్పుడు క్రమశిక్షణ కమిటీ ఎదుటకు చేరింది. ఈ ఇద్దరు నేతలు మంగళవారం పార్టీ క్రమశిక్షణ కమిటీ ఎదుట హాజరయ్యారు. అయితే ఈ విచారణలో కొలికపూడి సమర్పించిన ఆధారాలు, ఆరోపణలు పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి.
విశ్వసనీయ సమాచారం ప్రకారం, కొలికపూడి మూడు పెన్ డ్రైవ్‌లు, ఒక హార్డ్‌డిస్క్, 200 పేజీల లిఖిత పత్రాలు క్రమశిక్షణ కమిటీకి అందజేశారు. ఆయన కేశినేని చిన్ని పై పార్టీ పదవుల అమ్మకాలు, తిరువూరు సీటు కోసం రూ.5 కోట్ల లావాదేవీలు జరిగినట్లు ఆరోపించారు. అంతేకాదు, చిన్ని పీఏ కిషోర్, చిన్ని సన్నిహితులతో కలిసి గంజాయి వ్యాపారం, ఇసుక, మట్టి తవ్వకాల దందాలు జరుగుతున్నాయని కూడా కొలికపూడి వెల్లడించినట్లు సమాచారం.
క్రమశిక్షణ కమిటీ కొలికపూడితో సుమారు 3 గంటల 45 నిమిషాల పాటు విచారణ జరిపింది. అదే సమయంలో కేశినేని చిన్నిని కేవలం 20 నిమిషాలు మాత్రమే విచారించారు. ఈ నేపథ్యంలో పార్టీ అంతర్గతంగా కొందరు నేతలు “పార్టీ నిర్ణయం ఏ వైపునకు వెళ్తుందో” అని ఆతృతగా గమనిస్తున్నారు. కొలికపూడి తన వద్ద ఉన్న అన్ని ఆధారాలను సమర్పించిన తర్వాత కూడా, పార్టీ నుండి ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత రాకపోవడంతో, “చిన్నిపై యాక్షన్ వచ్చే వరకు మౌనం పాటిస్తా” అని ఆయన నిర్ణయం తీసుకున్నారని సమాచారం.
క్రమశిక్షణ కమిటీ విచారణ సమయంలో పార్టీ ప్రధాన కార్యాలయంలోనే నారా లోకేష్ ఉన్నారు. కొలికపూడి ఆయనను కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ, షెడ్యూల్ కారణంగా కలవలేకపోయారని తెలుస్తోంది. ఈ ఘటనతో టీడీపీ లోపల మళ్లీ ఉద్రిక్తతలు ముదురుతున్నాయి. పార్టీ అంతర్గతంగా ఈ వ్యవహారాన్ని ఎలా పరిష్కరిస్తుందో చూడాలి, కానీ ప్రస్తుతానికి మాత్రం ‘కొలికపూడి vs చిన్ని’ రచ్చతో టీడీపీ బాగా ఇబ్బందుల్లో పడింది.








