ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత ప్రజలను వణికించిన మొంథా తుపాన్ చివరికి తీరం తాకింది. ఈరోజు సాయంత్రం 7:40 గంటలకు తుఫాన్ అంతర్వేది–పాలెం మధ్య తీరాన్ని తాకినట్లు వాతావరణ శాఖ ప్రకటించింది. గడచిన ఆరు గంటలుగా గంటకు 17 కిలోమీటర్ల వేగంతో కదిలిన మొంథా, ప్రస్తుతం తీరం దాటే ప్రక్రియలో ఉంది. వాతావరణ నిపుణుల అంచనాల ప్రకారం, పూర్తిగా తీరం దాటడానికి మరో 3–4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది.
తీర ప్రాంతాల్లో గంటకు 90–100 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు విరుచుకుపడుతున్నాయి. భారీ వృక్షాలు నేలకూలుతున్నాయి, విద్యుత్ సరఫరా అంతరాయం ఏర్పడింది. సముద్రం ఉగ్రరూపం దాల్చడంతో రాక్షస అలలు ఎగసిపడుతున్నాయి.
ఇవాళ రాత్రి, రేపు భారీ వర్షాలు
తుపాను ప్రభావంతో నేడు, రేపు రాష్ట్ర వ్యాప్తంగా భారీవర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. రాష్ట్రంలోని 17 జిల్లాల్లో ఈరోజు రాత్రి భారీవర్షాలు కురిసే అవకాశం ఉంది. రేపు శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, అల్లూరి, విశాఖపట్నం, అనకాపల్లి జిల్లాల్లో అక్కడక్కడ భారీవర్షాలు కురువనున్నాయి. ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురిసే అవకావం ఉంది. కాకినాడ, కోనసీమ, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీవర్షాలు కురుస్తాయి. ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో కూడా తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదవుతుంది.
అధికార యంత్రాంగం హై అలర్ట్
తుపాను ప్రభావం ఎక్కువగా ఉండే తీర జిల్లాల్లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలు కొనసాగుతున్నాయి. కోనసీమ, కాకినాడ, కృష్ణా జిల్లాల్లో పునరావాస కేంద్రాలు సిద్ధం చేశారు. మత్స్యకారులు సముద్ర యాత్రలకు వెళ్లవద్దని మరోసారి హెచ్చరికలు జారీ చేశారు. మొంథా తుఫాన్ ప్రభావం రాత్రి మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉండటంతో తీరప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు విజ్ఞప్తి చేశారు.








