- రైతులను ఆదుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు
- పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు, అరెస్టులు
వైసీపీ ప్రజా సమస్యలపై పోరాటాన్ని మొదలెట్టింది. మొదటగా అన్నం పెట్టే రైతుల తరఫున గళం విప్పింది. నేడు రాష్ట్రవ్యాప్తంగా రైతుల సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపట్టింది. ముఖ్యంగా కూటమి ప్రభుత్వం రైతులకు కనీస మద్దతు ధర, ఉచిత పంటల బీమా వంటి అంశాలను విస్మరించి, వారి సమస్యలను పట్టించుకోకపోవడంపై విమర్శలు వ్యక్తం చేసింది. వైసీపీ నేతలు రైతులతో కలిసి కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేసి, అన్నదాతల హక్కుల కోసం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కాగా, రైతులకు అండగా వైసీపీ నిర్వహిస్తున్న పోరాటానికి అడుగడుగునా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
విజయవాడలో ఉద్రిక్తతలు – అవినాష్ అరెస్ట్
విజయవాడలో దేవినేని అవినాష్ అరెస్టు కీలక మలుపుగా మారింది. కలెక్టర్ కార్యాలయానికి వెళ్తుండగా పోలీసులు ఆయనను అరెస్టు చేయడం వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహాన్ని రగిలించింది. ప్రజాస్వామ్యంలో ఇలాంటి చర్యలు తగవని అవినాష్ పోలీసులపై ఫైర్ అయ్యారు.
చిత్తూరులో ర్యాలీలు – టీడీపీ, వైసీపీ మధ్య పోటీ
చిత్తూరులో టీడీపీ, వైసీపీ పార్టీలు ప్రత్యేకంగా ర్యాలీలు నిర్వహించాయి. వైసీపీ రైతు సమస్యల పరిష్కారానికి, సూపర్ సిక్స్ అమలు డిమాండ్ చేస్తుండగా, టీడీపీ ప్రభుత్వం గతంలో చేపట్టిన ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి కార్యక్రమాలను ప్రస్తావిస్తూ ప్రజలను ఆకర్షించేందుకు ప్రయత్నించింది.
అనంతపురంలో టీడీపీ ఫ్లెక్సీలు – వైసీపీ ఆగ్రహం
అనంతపురంలో టీడీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వైసీపీ కార్యకర్తల్లో ఆగ్రహం తెప్పించాయి. ఈ ఫ్లెక్సీలలో గత వైసీపీ ప్రభుత్వం రైతులకు ఏం చేసిందనే ప్రశ్నలు ప్రస్తావించడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తమైంది.
విశాఖపట్నంలో భారీ ర్యాలీ
విశాఖపట్నంలో వైసీపీ “అన్నదాతకు అండగా” పేరుతో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించింది. కనీస మద్దతు ధర, తడిచిన ధాన్యం కొనుగోలు, రైతులకు పెట్టుబడి సాయం వంటి కీలక డిమాండ్లను పేర్కొంటూ వైసీపీ నేతలు కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.








