బంగాళాఖాతం (Bay of Bengal)లో ఏర్పడిన మొంథా (Montha) తుఫాన్ (Cyclone) ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) వైపునకు దూసుకొస్తోంది. ఇప్పటికే తుఫాన్ ప్రభావిత ప్రాంతాలకు వాతావరణ శాఖ (Weather Department) హెచ్చరికలు జారీ చేసింది. తీర ప్రాంతాలైన నెల్లూరు, కాకినాడ, విశాఖ వంటి ప్రాంతాలల్లో మొంథా ఎఫెక్ట్ స్టార్ట్ అయ్యింది. రాష్ట్రంలో నేడు, రేపు, ఎల్లుండి మూడు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి (Chief Minister) చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) సచివాలయం నుండి ఆర్టీజీఎస్ ద్వారా అధికారులతో అత్యవసర సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం తుఫాన్ కాకినాడకు 680 కి.మీ దూరంలో ఉన్నట్లు అధికారులు తెలిపారు. గంటకు 16 కి.మీ వేగంతో కదులుతున్న ఈ తుఫాన్ రేపు రాత్రి తీరాన్ని తాకే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది.
తుఫాన్ కదలికలను ప్రతి గంటకూ గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు. కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాల సూచన ఉన్నట్లు సమాచారం. తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాలువ గట్లు పటిష్ఠం చేసి పంటనష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎం సూచించారు.
సీఎంకు పీఎం ఫోన్
ఇక తుఫాన్ పరిస్థితిపై ప్రధాని నరేంద్ర మోదీ కూడా ముఖ్యమంత్రి చంద్రబాబుతో ఫోన్లో మాట్లాడారు. కేంద్ర సహాయం అవసరమైతే వెంటనే తెలియజేయాలని ప్రధాని హామీ ఇచ్చినట్లు సమాచారం. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని ఆదేశించారు.








