తెలంగాణ (Telangana)లో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై బీఆర్‌ఎస్ (BRS) వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR) గురువారం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ముఖ్యమంత్రి, మంత్రుల మధ్య జరుగుతున్న పంపకాల పరంపర రాష్ట్ర పరువుకు మచ్చ తెచ్చిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఏఎస్ అధికారి రిజ్వి వలంటరీ రిటైర్మెంట్ వెనుక సీఎం అల్లుడు, మంత్రి కుమారుడి మధ్య జరిగిన టెండర్ వివాదం ఉందని, దీని కారణంగానే పరిపాలన దిగజారిపోయిందని విమర్శించారు.
“ఈ ప్రభుత్వం నడుపుతోంది దండుపాళ్యం ముఠా లాగే. ముఖ్యమంత్రి ఇల్లు పరిపాలనా కేంద్రమా లేక సెటిల్‌మెంట్‌ల అడ్డానా?” అని కేటీఆర్ ఘాటుగా ప్రశ్నించారు. తాజాగా తుపాకీ వివాదంపై స్పందిస్తూ.. “పారిశ్రామికవేత్తను బెదిరించడం నిజం. పోలీసులు నిజాయితీగా ఉంటే దోషులను అరెస్ట్ చేయాలి” అని డిమాండ్ చేశారు. మంత్రి ఇంటికి పోలీసులు వెళ్లడం పాలనా పతనానికి సంకేతమని పేర్కొంటూ, ఇది కాంగ్రెస్–బీజేపీ జాయింట్ వెంచర్ ప్రభుత్వమని, బీజేపీ నేతలు ఎందుకు మౌనంగా ఉన్నారని కేటీఆర్ ప్రశ్నాస్త్రాలు సంధించారు.








