రాష్ట్రంలో ఇప్పటికే సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ (Nara Lokesh)ల హెలికాప్టర్, ప్రత్యేక విమానాల పర్యటనలతో ఖజానాపై భారమైందని విమర్శలు వస్తున్న వేళ, ఇప్పుడు “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్ (Super GST – Super Saving)” పేరుతో ప్రభుత్వం చేస్తున్న ప్రచార ఖర్చుపై కొత్త వివాదం చెలరేగింది. ఈ ప్రచారం కోసం కూటమి ప్రభుత్వం ఏకంగా రూ.45 కోట్లు ఖర్చు చేస్తోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
జిల్లాల వారీగా భారీ కేటాయింపులు
నెల రోజుల పాటు కొనసాగనున్న ఈ ప్రచారం కోసం అన్ని జిల్లాలకు రూ.26 కోట్లు, వాణిజ్య పన్నుల శాఖకు రూ.4 కోట్లకు ఇండెంట్ పెట్టినట్లు సమాచారం. తొలి విడతలో ప్రతి జిల్లాకు రూ.50 లక్షల చొప్పున మొత్తం రూ.13 కోట్లు, అదనంగా వాణిజ్య పన్నుల శాఖకు రూ.2 కోట్లు. ఇలా రూ.15 కోట్లు ఇప్పటికే విడుదల చేశారు. మిగిలిన రూ.15 కోట్లు రెండో విడతలో విడుదల చేయాలని ప్రభుత్వం సిద్ధమవుతోంది.
మాస్ మీడియా, డిజిటల్ ప్రచారం
ఈ నిధులతో గ్రామ స్థాయివరకు మాస్ మీడియా మరియు డిజిటల్ ప్లాట్‌ఫార్మ్‌ల ద్వారా ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. అదనంగా, ఈ నెల 16న ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) పాల్గొననున్న “సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్” ఈవెంట్ కోసం మరిన్ని రూ.15 కోట్లు కేటాయించిందని సమాచారం.
ప్రజల ఆగ్రహం
జీఎస్టీ సేవింగ్ వల్ల వస్తువుల ధరలు తగ్గుతున్నాయనే అంశం పక్కనబెడితే, ప్రజా ధనంతో భారీ స్థాయి ప్రచారానికి రూ.45 కోట్లు వెచ్చించడం పట్ల ప్రజలు, అధికార వర్గాలు తీవ్ర విమర్శలు వ్యక్తం చేస్తున్నారు. “ప్రజల డబ్బుతో ప్రభుత్వ ప్రతిష్ఠ పెంచుకోవడం సరైంది కాదు” అని ప్రజాసంఘాలు, మేధావి వర్గాలు మండిపడుతున్నాయి.







