వెనుకబడిన తరగతులకు (బీసీ) జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు సాధించే లక్ష్యంతో తెలంగాణ బీసీ ఐక్య కార్యాచరణ సమితి (బీసీ జేఏసీ) (BC JAC) ఏర్పాటైంది. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన ప్రత్యేక సమావేశంలో 40 బీసీ సంఘాలు, 110 కుల సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో బీసీ జేఏసీ కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య (R. Krishnayya)ను జేఏసీ చైర్మన్‌గా, జాజుల శ్రీనివాస్‌గౌడ్ (Jajula Srinivas Goud)ను వర్కింగ్ చైర్మన్‌గా ఎన్నుకున్నారు.
బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నూతనంగా ఏర్పాటైన జేఏసీ తమ పోరాట కార్యాచరణను ప్రకటించింది. ఇందులో భాగంగా, గతంలో ప్రకటించిన అక్టోబర్ 13 రహదారుల దిగ్బంధం, 14 రాష్ట్ర బంద్ కార్యక్రమాలను వాయిదా వేశారు. అన్ని జిల్లాలు, నియోజకవర్గాలు, మండలాల వారీగా తక్షణమే కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. రిజర్వేషన్లను వ్యతిరేకించేవారికి, ప్రభుత్వాలకు సెగ తగిలేలా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రకటిస్తూ, ఈ నెల 18న రాష్ట్ర బంద్‌కు బీసీ జేఏసీ పిలుపునిచ్చింది.
ఈ సందర్భంగా చైర్మన్ ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీ రిజర్వేషన్ల (BC Reservations) జీవో(GO)పై హైకోర్టు (High Court) స్టే విధించడం అన్యాయమని, రిజర్వేషన్లు సాధించుకోవాలంటే ప్రతి బీసీ పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో 60% బీసీలు ఉన్నా ఐక్యంగా లేకపోవడం వల్లే రిజర్వేషన్లు అందకుండా పోయాయని వర్కింగ్ చైర్మన్ జాజుల శ్రీనివాస్‌గౌడ్ (Jajula Srinivas Goud) పేర్కొన్నారు. బీసీలంతా ఐక్యమై తమ హక్కులను సాధించుకోవాలని నేతలు స్పష్టం చేశారు.








