సినీ నటుడు మోహన్‌బాబు ఆస్పత్రిలో చేరారు. జల్‌పల్లిలోని తన నివాసం వద్ద నిన్న రాత్రి జరిగిన ఘటన అనంతరం ఆయనకు బీపీ పెరగడంతో పెద్ద కుమారుడు మంచు విష్ణు గచ్చిబౌలిలోని కాంటినెంటల్ ఆస్పత్రిలో మోహన్‌బాబును చేర్పించారు. వైద్యులు ఆయనకు చికిత్స అందిస్తున్నారు. మోహన్‌బాబు భార్య కూడా అదే ఆస్పత్రిలో పొందుతుండడం గమనార్హం.
తుపాకుల స్వాధీనం చేసుకున్న పోలీసులు
మోహన్‌బాబు నివాసం వద్ద పరిస్థితులు ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు. మోహన్‌బాబుతో పాటు ఆయన కుమారుడు విష్ణుకు మంజూరు చేసిన లైసెన్స్ గన్స్ స్వాధీనం చేసుకున్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు.
జర్నలిస్టులపై దాడి.. కేసు నమోదు
మంగళవారం రాత్రి కుటుంబ వివాదం కవరేజ్ కోసం జల్‌పల్లిలోని మోహన్‌బాబు నివాసానికి వెళ్లిన మీడియా ప్రతినిధులపై దాడి జరిగింది. ఈ ఘటనలో మోహన్‌బాబుతో పాటు ఆయన బౌన్సర్లు, సహాయకులు జర్నలిస్టులను గేటు బయటకు తోసేయడంతో పాటు దాడి చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఓ ఛానల్ ప్రతినిధి చేతిలో నుంచి మైక్ లాక్కుని దాడి చేశారు. మీడియాపై దాడిని నిరసిస్తూ జర్నలిస్టులు మోహన్‌బాబు ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పహాడీ షరీఫ్ పోలీసులు మోహన్‌బాబుపై కేసు నమోదు చేశారు.