మత్స్యకారుల (Fishermen’s) సమస్యలను పరిష్కరించేందుకు జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ (Pawan Kalyan) బుధవారం తాను ప్రాతినిథ్యం వహిస్తున్న పిఠాపురం (Pithapuram) నియోజకవర్గం ఉప్పాడ (Uppada)లో పర్యటించారు. ఉప్పాడలో అధికారులతో సమీక్ష అనంతరం బహిరంగ సభలో పాల్గొని మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలుచేశారు.
“ఉప్పాడలో సుమారు 7,193 మత్స్యకారుల కుటుంబాలు చేపల వేటపై ఆధారపడ్డాయి. వేట నిషేధం సమయంలో ప్రతి మత్స్యకార కుటుంబానికి సంవత్సరానికి రూ.20,000 చొప్పున సహాయం అందిస్తున్నాం” అని తెలిపారు. పరిశ్రమల వ్యర్థాలు సముద్రంలో కలవడంతో మత్స్యసంపద తగ్గిపోతుందని ప్రజలు ఆందోళన చెందుతున్నారని, ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.
ఉప్పాడలో రూ.323 కోట్ల వ్యయంతో సీ ప్రొటెక్షన్ వాల్ నిర్మాణం త్వరలో ప్రారంభమవుతుందని, ఈనెల 14న ప్రాజెక్ట్‌పై సమీక్షా సమావేశం జరగనున్నదని తెలిపారు. “ఉప్పాడ–కొణపాక మధ్య తీరరక్షణ పనులు ఇప్పటికే ప్రారంభించాం. పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదుగానీ, వాటి వ్యర్థాలు శుద్ధి చేయకుండా సముద్రంలో వదిలేస్తే మత్స్యకారుల జీవనాధారం దెబ్బతింటుంది” అని ఆయన స్పష్టం చేశారు.
“మత్స్యకారులు చూపిన చోట్ల పరిశ్రమల వ్యర్థాల ప్రభావాన్ని మూడు విడతల్లో పరిశీలిస్తాం. ఎక్కడ కాలుష్యం జరుగుతోందో అక్కడికే నేను బోటులో వెళ్తా. ప్రజలను వంచించే ఉద్దేశం నాకు లేదు. ప్రజలకు న్యాయం చేయలేకపోతే రాజకీయాలు వదిలేసి వెళ్తా. మీరు 100 రోజులు సమయం ఇవ్వండి.. కాలుష్యం తగ్గించేందుకు స్పష్టమైన ప్రణాళిక రూపొందిస్తాం” అని తెలిపారు. చివరగా, “నేను మీలో ఒకడిని, మీ సమస్యలను అర్థం చేసుకున్నా” అంటూ పవన్ కల్యాణ్ మత్స్యకారులకు హామీ ఇచ్చారు.
మీకు న్యాయం చేయలేనప్పుడు రాజకీయాలు వదిలేసి వెళ్లిపోతా..
— Telugu Feed (@Telugufeedsite) October 9, 2025
ఉప్పాడ సభలో డీ.సీఎం పవన్ కళ్యాణ్ pic.twitter.com/8xTphryrz8







