కర్ణాటక (Karnataka) నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టి (Rishab Shetty)పై తెలుగు యువత తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిషబ్ నటించి, దర్శకత్వం వహించిన ‘కాంతార-1’ (Kantara-1) సినిమా అక్టోబర్ 2న విడుదల కానుంది. హైదరాబాద్ (Hyderabad)లో జరిగిన ప్రీ-రిలీజ్ (Pre-Release) ఈవెంట్‌లో రిషబ్ శెట్టి తెలుగు(Telugu)లో ఒక్క మాట కూడా మాట్లాడకుండా కేవలం కన్నడ (Kannada)లో మాట్లాడటంతో ఈ వివాదం మొదలైంది.
పలువురు తెలుగు ప్రేక్షకులు, యువత సోషల్ మీడియాలో రిషబ్ శెట్టిని విమర్శిస్తున్నారు. ఇతర నటులు, హిందీ నటుడు హృతిక్ రోషన్ వంటి వారు తెలుగు రాష్ట్రాలకు వచ్చినప్పుడు తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించారని, కానీ రిషబ్ శెట్టి మాత్రం తెలుగును పూర్తిగా విస్మరించారని ఆరోపిస్తున్నారు. దీనిపై “తెలుగు అంటే అంత చిన్న చూపా?” అంటూ ప్రశ్నిస్తున్నారు.
గతంలో పవన్ కల్యాణ్ ‘ఓజీ’ సినిమాపై కర్ణాటకలో కన్నడ సంఘాలు తెలుగు పాటలు ఉన్నాయంటూ అభ్యంతరం వ్యక్తం చేయడం, ‘హరిహర వీరమల్లు’ ఫ్లెక్సీలను చించివేయడం వంటి ఘటనలను ప్రస్తావిస్తూ, ఇప్పుడు తమ గడ్డపైకి వచ్చి తెలుగు మాట్లాడకపోవడంపై తీవ్రంగా మండిపడుతున్నారు.
రిషబ్ శెట్టి ఇతర రాష్ట్రాల్లో, ముఖ్యంగా తమిళనాడు, ముంబైలలో ఆయా భాషల్లో మాట్లాడేందుకు ప్రయత్నించారని, కానీ హైదరాబాద్‌లో మాత్రం తెలుగును విస్మరించారని విమర్శిస్తూ, ‘కాంతార-1’ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో బహిష్కరించాలని సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారు. ఈ పరిణామంతో సినిమాపై నెగిటివిటీ పెరిగింది.







