భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) వెస్టిండీస్ (West Indies)తో జరగనున్న టెస్ట్ సిరీస్ (Test Series)కు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. యువ బ్యాట్స్‌మెన్ శుబ్‌మన్ గిల్(Shubman Gill) జట్టుకు సారథ్యం వహించనుండగా, రవీంద్ర జడేజా (Ravindra Jadeja) వైస్ కెప్టెన్‌గా వ్యవహరించనున్నారు. ఇంగ్లండ్ పర్యటనలో ఆడిన జట్టుతో పోలిస్తే కొన్ని స్వల్ప మార్పులు చేశారు.
గాయం నుంచి కోలుకున్న ఆంధ్ర ఆల్‌రౌండర్ నితీశ్ కుమార్ రెడ్డి (Nitish Kumar Reddy) తిరిగి జట్టులోకి వచ్చాడు. గాయం కారణంగా రిషభ్ పంత్ ఈ సిరీస్‌కు దూరమవగా, కరుణ్ నాయర్‌ను జట్టు నుంచి తప్పించారు. పంత్ స్థానంలో ధ్రువ్ జురెల్‌తో పాటు తమిళనాడు ఆటగాడు నారాయణ్ జగదీశన్‌కు చోటు దక్కింది.
బౌలింగ్ విభాగంలో పేసర్లుగా జస్‌ప్రీత్ బుమ్రా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ కృష్ణ ఎంపికయ్యారు. స్పిన్నర్లుగా కుల్దీప్ యాదవ్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్ జట్టులో ఉన్నారు. ఈ సిరీస్ అక్టోబర్ 2 నుంచి 14 వరకు జరుగుతుంది.








